‘మహిళా శక్తి’కి జై!

23 Nov, 2017 02:07 IST|Sakshi

 వెనుకబడిన 115 జిల్లాల్లో ఆ కేంద్రాల ఏర్పాటుకు అంగీకారం

సీపీఎస్‌ఈ ఉద్యోగుల వేతన సవరణకు ఆమోదం

సుప్రీం, హైకోర్టు జడ్జీల వేతనాల పెంపు

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో ‘ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళలకు చేరువై వారిలో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్‌ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌ఈ)లు కార్మిక సంఘాల్లో సభ్యులైన తమ ఉద్యోగులతో వేతన సవరణపై తదుపరి చర్చలు జరిపేందుకు కూడా అంగీకరించింది. చాలా కాలంగా పెండింగులో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాల పెంపు ప్రతిపాదనకు సైతం మోక్షం లభించింది.

‘బేటీ బచావో–బేటీ పడావో’ విస్తరణ
115 జిల్లాల్లో బ్లాకు స్థాయిలో 920 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాగే ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో–బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 ‘వన్‌స్టాప్‌ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఓకే చెప్పింది. విస్తృత పథకమైన ‘ది నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017–20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు.  

భారం సీపీఎస్‌ఈల పైనే
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులతో 8వ దఫా వేతన చర్చలు జరిపేందుకు రూపొందించిన విధాన ప్రక్రియకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘ఉత్పత్తితో పోలిస్తే కార్మికులకయ్యే వ్యయం పెరగకూడదన్న షరతుకు లోబడి వేతన సవరణ జరగాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం, అది కూడా సీపీఎస్‌ఈలు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లయితేనే, సంబంధిత పాలనా విభాగం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించిన తరువాతే వేతన పెంపు నిర్ణయం తీసుకోవాలి’ అని కేబినెట్‌ భేటీ తరువాత ప్రకటన వెలువడింది. ‘వేతనాలు పెరిగితే కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు.

ఆర్థిక భారమంతా సదరు సంస్థపైనే ఉంటుంది. ఉద్యోగుల వేతనాలు పెరిగిన తరువాత తమ ఉత్పత్తులు, సేవల ధరలు పెరగకుండా సీపీఎస్‌ఈలు చూసుకోవాలి. ఇలా సవరించిన వేతనాలు ఎగ్జిక్యూటివ్‌లు, అధికారులు, యూనియనేతర ఉద్యోగుల వేతనాలను మించకూడదు’ అని అన్నారు. తమకున్న ఆర్థిక వనరులు, చెల్లించే స్తోమత ఆధారంగా వేతన సవరణపై కార్మికులతో చర్చలు జరిపేందుకు ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. సవరించిన వేతనాలు 2017, జనవరి నుంచి అమల్లోకి వచ్చి ఐదేళ్లు లేదా పదేళ్లు (ఏది ఎంచుకుంటే అది) వర్తిస్తాయి. అటవీయేతర ప్రాంతాల్లో పెంచిన వెదురు చెట్లను నరికేయకుండా సంబంధిత చట్టంలో సవరణ చేసేలా ఆర్డినెన్స్‌ తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

సీజేఐ వేతనం రూ.2.80 లక్షలు
సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్‌ అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్‌ ఠాకూర్‌ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు