సొంతంగా కమాండో యూనిట్ ఏర్పాటు

3 Jan, 2016 17:35 IST|Sakshi
ఆదివారం విలేకరులతో మాట్లాడుతున్న పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్

- పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం
- సరిహద్దులో భద్రత పెంచాల్సిందిగా కేంద్రానికి వినతి


చండీగఢ్: సరిహద్దులో అవసరమైన మేరకు భద్రతా దళాలను మోహరించకపోవటం వల్లే ఉగ్రవాదులు పంజాబ్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు భద్రతకు సొంతంగా కమాండో యూనిట్ ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. జమ్ముకశ్మీర్ లాగే పంజాబ్ సరిహద్దులోనూ భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆదివారం సాయంత్రం విలేకరులకు ఈ విషయాలు చెప్పారు.

'ఇటీవలి వరుస దాడులతో పంజాబ్ సరిహద్దులోనూ పటిష్ఠభద్రత అవసరమని భావిస్తున్నాం. ఆ మేరకు పఠాన్ కోట్ లో స్వాట్ బలగాల శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కమాండో యూనిట్ ఏర్పాటు చేస్తాం. ఈ బలగాలు రెండో రక్షణ పంక్తి(సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్)గా ఉపయోగపడుతుంది' అని సుఖ్బీర్ పేర్కొన్నారు.


పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడులు, భారత భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు జవాన్లుకాగా, ఐదుగురు ముష్కరులు. ఎయిర్ బేస్ లో నక్కిఉన్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు