‘150 రైళ్లు..50 స్టేషన్లు ప్రైవేటుపరం’

10 Oct, 2019 19:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తేజాస్‌ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశలవారీగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని కేంద్రం గురువారం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం గురించి నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ముందకు తీసుకువెళ్లేందుకు సాధికార కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని లేఖలో కాంత్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటకీరణ అనుభవాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల్లోనూ ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యదర్శులతో కూడిన సాధికార కమిటీ ఏర్పాటవుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌కు రాసిన లేఖలో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ప్రయాణీకుల రైళ్ల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు