కోర్టే.. పోలీసులను హంతకులు అనొచ్చా?

29 Sep, 2018 04:32 IST|Sakshi

న్యూఢిల్లీ: మణిపూర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్ల కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులను హంతకులుగా అభివర్ణించడాన్ని కేంద్రం తీవ్రంగా ఆక్షేపించింది. ఉన్నత న్యాయస్థానమే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. మణిపూర్, కశ్మీర్‌లలో ప్రాణాలను పణంగా పెట్టి బలగాలు విధులు నిర్వహిస్తున్నాయని వారిపై విచారణకు ఆదేశించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఈ కేసులు నమోదు చేయడం సరికాదని కోర్టును కోరారు.

అయితే ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. సీబీఐ డైరెక్టర్‌తో చర్చ సందర్భంగా యథాలాపంగా అన్నట్లు కోర్టు స్పష్టతనిచ్చింది. మణిపూర్‌లో 1,528 మంది అమాయక పౌరులు, ఆందోళనకారులను బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చినట్లు భద్రతా దళాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేసి.. చార్జిషీటు నమోదు చేయాలని జూలై 14న సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్‌ పోలీసు ఉన్నతాధికారులతోపాటు 300 మంది ఆర్మీ జవాన్లు సుప్రీంలో పిల్‌ దాఖలు చేశారు. సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం అమల్లో ఉండగా ఇలాంటి కేసులు పెట్టడమేంటని తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను సవాల్‌ చేశారు.

మరిన్ని వార్తలు