పాలనా వ్యవహారాల్లో ‘దళిత్‌’ పదప్రయోగం వద్దు

5 Apr, 2018 02:42 IST|Sakshi

రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ కేంద్రం తాజా సూచన

న్యూఢిల్లీ: పాలనా వ్యవహారాల్లో దళిత్‌ అనే పద ప్రయోగం తగదంటూ రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేంద్రం సూచించింది. అధికారిక వ్యవహారాలన్నింటిలోనూ షెడ్యూల్డ్‌ కాస్ట్‌ అనే పదానికి బదులుగా దళిత్‌ అని వాడరాదనీ, షెడ్యూల్డ్‌ కాస్ట్‌గానే దాన్ని ఉపయోగించాలని కోరుతూ మార్చి 15, 2018న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ లేఖరాసింది.  అన్ని పాలనా వ్యవహారాల్లో, సర్టిఫికెట్లలో, అధికారిక లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో, రాజ్యాంగ పదమైన షెడ్యూల్డ్‌ కాస్ట్‌ అనే వాడాలని ఈ లేఖలో స్పష్టం చేసింది.

కేంద్ర మంత్రులు, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఎలక్షన్‌ కమిషన్‌ లకు ఉద్దేశించిన ఈ లేఖలో మోహన్‌లాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌ బెంచ్‌ జనవరి 15, 2018న ఇచ్చిన తీర్పుని ఉటంకించారు. భారత రాజ్యాంగంలో ప్రస్తావించని దళిత్‌ అనే పదాన్ని ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులనుద్దేశించి వాడకూడదని కూడా ఈ లేఖ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా 1982 ఫిబ్రవరి 10న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖ  షెడ్యూల్డ్‌ కుల ధృవీకరణ పత్రాల్లో సదరు వ్యక్తి కులాన్ని ప్రస్తావించాలనీ, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏ అంశం కింద ఆ వ్యక్తిని షెడ్యూల్డ్‌ కాస్ట్‌గా గుర్తించారో కూడా పేర్కొనాలని, అంతేకానీ ‘హరిజన’ అనే పదాన్ని ఉపయోగించకూడదనీ చెప్పిన విషయాన్ని చర్చించింది. మళ్ళీ రెండేళ్ళ తరువాత అంటే 1990 ఆగస్టు 18న సోషల్‌ వెల్ఫేర్‌ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వాలను షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌నే వాడాలని సూచించిందని కూడా లేఖలో ప్రస్తావించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల్లోని గవర్నర్లతో సంప్రదించి, కులాలు, జాతులు, తెగలను, లేదా ఆయా కులాల్లోని సమూహాలను ఆయా ప్రాంతాలను బట్టి రాష్ట్రపతి పబ్లిక్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్‌కి అనుగుణంగా చట్టం ప్రకారం ఆ లిస్ట్‌లోనికి అదనంగా చేర్చడం లేదంటే తీసివేయడం పార్లమెంటు చేస్తుంది.

మరిన్ని వార్తలు