కేరళ వరదలు : తీవ్ర విపత్తుగా గుర్తించిన కేంద్రం

20 Aug, 2018 19:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళను వణికించిన వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులు కాగా, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వరద బీభత్సం కేరళను అతలాకుతలం చేయడంతో దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్‌ ఊపందుకుంది. అయితే కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేరళ వరద పరిస్థితిని గుర్తించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. వరదలతో 247 మంది మరణించారని, 17 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, వేలాది ఎకరాల పంట నీటమునిగిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలతో పాటు స్వయంగా ప్రధాని, హోంమంత్రి కేరళ వరద పరిస్థితిని సమీక్షించడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశారు.

దీంతో కేరళలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో దీన్ని తీవ్ర ప్రకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రకటనతో కేరళకు ఇతోధిక సాయంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలకు ముమ్మరంగా చేపట్టేందుకు కేంద్రం అన్ని విధాలా చొరవ చూపనుంది.పలు రాష్ట్రాలు ఇప్పటికే పెద్ద ఎత్తున సాయం ప్రకటించగా, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు కష్టసమయంలో కేరళకు బాసటగా నిలుస్తామంటూ తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటించారు.

మరిన్ని వార్తలు