‘సోషల్‌ హబ్‌’పై కేంద్రం వెనక్కి

4 Aug, 2018 03:16 IST|Sakshi

నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకుంటామని హామీ

కేంద్రం విజ్ఞప్తితో పిటిషన్‌ రద్దుకు సుప్రీం అంగీకారం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిఘా కోసం తీసుకురావాలనుకున్న ‘సోషల్‌ మీడియా హబ్‌’పై కేంద్రం వెనక్కు తగ్గింది. సోషల్‌ మీడియా హబ్‌ ఏర్పాటుకు తాము జారీచేసిన నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ హబ్‌కు సంబంధించిన పాలసీని సమీక్షిస్తామని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌  వేణుగోపాల్‌ కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు సంబంధిత పిటిషన్‌ను కొట్టివేసేందుకు అంగీకరించింది. సోషల్‌ మీడియా, ఈ–మెయిల్స్‌లోని సమస్త సమాచారంపై నిఘా పెట్టేందుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ)ను జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మహువా మొయిత్రా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ విచారణ సందర్భంగా ‘దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా?’ అని కేంద్రంపై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.   

► రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను కోర్టులు విచారించేటప్పుడు దాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ లేదా రికార్డింగ్‌ చేసే విషయమై మార్గదర్శకాలను రూపొందించాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.
► శారదా చిట్‌ఫంట్‌ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య, న్యాయవాది నళినిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారుల్ని కోర్టు ఆదేశించింది. శారదా కంపెనీ లా బోర్డు సమావేశాలకు హాజరైన నళిని ఫీజుగా రూ.కోటి అందుకున్నారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఆమెకు సమన్లు జారీచేయడం తెల్సిందే.
► దేశంలో సిజేరియన్‌ ఆపరేషన్లు చేపట్టడంపై మార్గదర్శకాలు జారీచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిల్‌ను న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడంగా అభివర్ణించిన కోర్టు.. పిటిషనర్‌కు రూ.25,000 జరిమానా విధించింది. దీన్ని నాలుగు వారాల్లోగా సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా