ఆర్టికల్‌ 371 జోలికి వెళ్లం

9 Sep, 2019 04:01 IST|Sakshi
అమిత్‌ షా

స్పష్టం చేసిన హోంమంత్రి అమిత్‌ షా

గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 371 జోలికి వెళ్లబోమని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. అక్రమంగా ఒక్క వలసదారున్ని కూడా దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి (ఎన్‌ఈసీ) 68వ ప్లీనరీ సమావేశంలో అమిత్‌ షా మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. ‘దీనిపై నేను ఇదివరకే పార్లమెంటులో స్పష్టతనిచ్చాను.

నేడు 8మంది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మరోసారి చెబుతున్నా. కేంద్రం ఆర్టికల్‌ 371 జోలికి వెళ్లదు’ అని పునరుద్ఘాటించారు. ఆర్టికల్‌ 370ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దాన్ని రద్దుచేశామని, అయితే ఆర్టికల్‌ 371 మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుందని, ఈరెండింటి మధ్య చాలా తేడా ఉందని షా వివరించారు.  ఎన్‌ఆర్‌సీ గురించి మాట్లాడుతూ..అక్రమ చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరముందని షా అభిప్రాయపడ్డారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు