ఆ భూములు రైతులకు అప్పగింత

25 Dec, 2018 12:39 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా చత్తీస్‌గఢ్‌లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణాల మాఫీ ప్రకటించగా, ఇతర హామీల అమలుపైనా కసరత్తు సాగిస్తోంది. టాటా స్టీల్‌ ప్రాజెక్టు కోసం బస్తర్‌లో గిరిజన రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి వారికి అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం భూపేష్‌ బాగేల్‌ యోచిస్తున్నారు. భూసేకరణ జరిగిన ఐదేళ్లలోగా ప్రాజెక్టులు ప్రారంభించని చోట ఆయా భూములను తిరిగి సొంతదారులకు అప్పగిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చత్తీస్‌గఢ్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ క్రమంలో టాటా స్టీల్‌ ప్రాజెక్టు సైతం ముందుకు కదలకపోవడంతో ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను ఆయా రైతులకు అప్పగించే ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి తదుపరి కేబినెట్‌ సమావేశంలోగా తనకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ముఖ్యమంత్రి భూపేష్‌ బాగేల్‌ అధికారులకు సూచించినట్టు సమాచారం.

2005లో అప్పటి బీజేపీ ప్రభుత్వం బస్తర్‌ జిల్లాలోని లోహన్‌దిగుడ ప్రాంతంలో రూ 19,500 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం టాటా స్టీల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. ప్రాజెక్టు కోసం గిరిజనుల నుంచి భూ సేకరణ ప్రక్రియ 2008లో ప్రారంభమైంది. మొత్తం పదిగ్రామాల నుంచి 1764 హెక్టార్ల భూమిని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సేకరించింది.

ఇక భూసేకరణపై వివాదం నెలకొనడంతో 1707 మంది రైతులకు గాను 1165 మంది రైతులు తమకు ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని అంగీకరించారు. మిగిలిన రైతుల పరిహారాన్ని రెవిన్యూ డిపాజిట్‌ ఫండ్‌ వద్ద ప్రభుత్వం జమ చేసింది. ఇక 2016లో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోకముందే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు టాటా స్టీల్‌ ప్రకటించింది. భూసేకరణలో జాప్యం, మావోయిస్టుల బెదిరింపులు వంటి పలు కారణాలు చూపుతూ ప్రాజెక్టు నుంచి విరమించుకుంటున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. కాగా సేకరించిన భూమిని తిరిగి సొంతదారులకు అప్పగించాలని అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు