పోలీసులకు రూ.40 వేల జరిమానా

15 Oct, 2019 08:22 IST|Sakshi

క్రమశిక్షణా చర్యలకు సిఫార్సులు

తమిళనాడు,టీ.నగర్‌: కట్టపంచాయితీ వ్యవహారానికి సంబంధించి ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు తలా రూ.40 వేల అపరాధం విధిస్తూ మానవ హక్కుల కమిషన్‌ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ధర్మపురి జిల్లా పాలక్కోడు కరకదహల్లి గ్రామానికి చెందిన టి.శివషణ్ముగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో తాను న్యాయవాదిగా పనిచేస్తున్నానని, గత 2018లో ఒక సివిల్‌ వివాదంలో కొందరు కట్టపంచాయితీ జరిపి తనను, తన కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేసినట్లు చెప్పారు. గాయపడిన తాము ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నట్లు వివరించారు. దీనిపై ఫిర్యాదు చేసినా సంబంధిత వ్యక్తులపై అప్పటి సీఐ సతీష్‌కుమార్, ఎస్‌ఐ చంద్రన్‌ కేసు నమోదు చేయలేదని వెల్లడించారు.

కోర్టులో తప్పుడు సమాచారాన్ని అందజేసి నిందితులు బెయిలు పొందేందుకు సహకరించారని ఆరోపించారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు చిత్తరంజన్‌ మోహన్‌దాస్‌ సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ జరిపిన ఆయన పోలీసులు ఇరువురూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలుపుతూ బాధితుడు శివషణ్ముగంకు రూ.40 వేలను రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎనిమిది వారాల్లోగా అందజేసి, ఈ మొత్తాన్ని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌కుమార్, ఎస్‌ఐ చంద్రన్‌ల వద్ద వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా వారిపై అడిషనల్‌ సెక్రటరీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా