అతనో కదిలే చెత్తకుప్ప!

1 Dec, 2018 20:25 IST|Sakshi
ప్లాస్టిక్‌ వాడకంపై అవగాహన కల్పిస్తున్న బిష్ణూ భగత్‌

ప్లాస్టిక్‌ నిర్మూలన కోసం ఓ యువకుడి వినూత్న పోరాటం

భువనేశ్వర్‌ : అవును అతనో కదిలే చెత్తకుప్ప. కానీ అతని అంతరార్థం తెలిస్తే శభాష్‌ అని మెచ్చుకోక ఉండలేరు. ఓ ఆవు ప్లాస్టిక్‌ కవర్‌ తినడం చూసి చలించిపోయిన ఆ యువకుడు ప్లాస్టిక్‌ నిర్మూలన కోసం వినూత్న పద్దతిలో పోరాడుతూ..  ప్లాస్టిక్‌ వాడకంపై అవగాహన కల్పిస్తూ.. అధికారుల, ప్రజల కళ్లు తెరిపించాడు. మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్ ప్రమాదకరంగా మారుతోందని పర్యావరణవేత్తలు ఎంత హెచ్చరిస్తున్నా వినియోగం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 

మరోవైపు నిర్లక్ష్యంగా ప్లాస్టిక్‌ కవర్స్‌లో చెత్తను, ఆహారాన్ని పడేస్తుండటంతో అభంశుభం తెలియని మూగజీవులు వాటిని తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. మానవుడు చేసిన తప్పుకు పశువులు బలవుతున్నాయి. ఇది ఒడిశా, మయూర్‌బంజ్‌ జిల్లాలోని బరిపడ గ్రామానికి చెందిన 36 ఏళ్ల బిష్ణూ భగత్‌ను కలచివేసింది. వెంటనే ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేలా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి వినూత్నంగా పాలిథిన్‌ కవర్స్‌ను డ్రెస్‌గా ధరించి.. చెత్తకుప్పల పక్కన నిల్చొని ప్లాస్టిక్‌తో కలిగే ముప్పును చిన్నపిల్లలు.. పెద్దవారికి తెలియజేస్తున్నాడు.  అతని క్యాంపెయిన్‌ అక్కడి ప్రజల్లో చాలా మార్పును తీసుకొచ్చింది. ప్లాస్టిక్‌ నిర్మూలన కోసం భగత్‌ చేస్తున్న ప్రయత్నాన్ని మయూర్‌బంజ్‌ మెజిస్ట్రేట్‌ కొనియాడింది. ఇప్పుడు ఆ జిల్లాలో ఈ అంశం ఓ ఉద్యమంలా సాగుతోంది. అక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వాడకం ఓ పెద్ద సమస్యగా తయారైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్‌5న) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని దేశ ప్రజలను కోరారు.

>
మరిన్ని వార్తలు