ఆప్‌కు చందాలు బంద్.. ఎన్నారై డాక్టర్ ఉద్యమం

5 Jan, 2017 20:12 IST|Sakshi
ఆప్‌కు చందాలు బంద్.. ఎన్నారై డాక్టర్ ఉద్యమం
పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీరాలు పలికిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదిలోనే చుక్కెదురైంది. అమెరికా, కెనడా దేశాల నుంచి వస్తున్న విరాళాలను పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ ఎన్నారై వాలంటీర్లు ఆరోపించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు ఇవ్వొద్దంటూ ఓ ఎన్నారై డాక్టర్ ఏకంగా ఓ చిన్నపాటి ఉద్యమమే ప్రారంభించారు. దానికి 'చందా బంద్ సత్యాగ్రహం' అని డాక్టర్ మునీష్ రైజాదా పేరుపెట్టారు. చికాగోలో ప్రముఖ పిల్లల వైద్యుడైన ఆయన.. చండీగఢ్ వచ్చి మరీ ఈ ప్రచారం ప్రారంభించారు. విరాళాలను దాచిపెట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, గుర్‌ప్రీత్ ఘుగ్గి, హిమ్మత్ సింగ్ షేర్‌గిల్ లాంటి సీనియర్ నాయకులపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. 
 
ఎన్నారైల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలుచేస్తోందని, కానీ వెబ్‌సైట్‌లో మాత్రం వాళ్ల పేర్లు రాయడం లేదని డాక్టర్ రైజాదా ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాల విషయంలో పారదర్శకత పాటించడం లేదని, ఇందులో ఏదో లొసుగు ఉందని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టేందుకు తాను స్వయంగా 8-10 లక్షలు విరాళం ఇచ్చానని, ఇతరులతో కూడా చాలా ఇప్పించానని, కానీ ఆ డబ్బు ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు చేరలేదని చెప్పారు. ఆ డబ్బును పార్టీ నాయకులే కొట్టేసి ఉంటారని, దాంతో అసలు విరాళాలు సేకరించిన ఉద్దేశమే నెరవేరలేదని ఆయన అన్నారు.
>
మరిన్ని వార్తలు