189 చలానాలు.. బైక్‌ మీరే తీసుకొండి

21 Sep, 2019 11:13 IST|Sakshi

చండీగఢ్‌: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ట్రాఫిక్‌ చలానా అంటే చాలు జనాలు దడుచుకుంటున్నారు. కొత్త రూల్స్‌ ప్రకారం ఒకటి, రెండు చలానాలు వస్తే.. చాలు.. ఆ సొమ్ము చెల్లించడానికి ఏకంగా వాహనాన్ని అమ్మల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఓ బైక్‌ మీద ఏకంగా 189 చలానాలు ఉండటం ఒక ఎత్తయితే.. దీని గురించి సదరు బైక్‌ యజమానికి ఎలాంటి సమాచారం లేకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. వివరాలు.. చండీగఢ్‌కు చెందిన సంజీవ్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సెక్టార్‌ 33 ప్రాంతంలో రాంగ్‌ డైరెక్షన్‌లో యూ టర్న్‌ తీసుకున్నాడు. దాంతో ట్రాఫిక్‌ సిబ్బంది అతనికి రూ.300 చలానా విధించి.. జిల్లా కోర్టుకు పంపించారు. అక్కడ సంజీవ్‌కు దిమ్మతిరిగిపోయే విషయం తెలిసింది.

2017-19 మధ్య కాలంలో సంజీవ్‌ మీద 189 ట్రాఫిక్‌ చలానా నమోదయ్యాయనే విషయం వెలుగు చూసింది. దాంతో ఆశ్చర్యపోవడం సంజీవ్‌ వంతయ్యింది. దీని గురించి సంజీవ్‌ మాట్లాడుతూ.. ‘పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు నేను ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తూ ఉంటాను. కానీ మరి ఇంత భారీ సంఖ్యలో నా మీద చలానాలు నమోదైన సంగతి నిజంగా నాకు తెలీదు. దీని గురించి ట్రాఫిక్‌ సిబ్బంది కూడా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు’ అని తెలిపాడు. అంతేకాక ‘కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి జాగ్రత్తగానే ఉంటున్నాను. కానీ ఇన్ని చలానాలున్నాయని నిజంగానే నాకు తెలీదు. ఇప్పుడు చలానాలను చెల్లించడం కంటే బైక్‌ను ఇక్కడే వదిలేసి వెళ్లడం మంచిది’ అంటూ వాపోయాడు. గతంలో ఓ పాల వ్యాపారి బైక్ మీద కూడా 36 చలానాలున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా