తీవ్రమైన దుమ్ము.. విమానాలకు బ్రేక్‌

14 Jun, 2018 12:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: దుమ్ము, ఇసుక తుపాన్లతో దేశ రాజధాని, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. వాతావరణంలో దట్టమైన దుమ్ము పొరలు అలుముకోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా, వెలుతురు లేని కారణంగా ఛండీగర్‌ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు. అటు కాలుష్యంతో నిండిన గాలిని పీల్చుకొని ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 

రాజస్థాన్‌లో మొదలైన ఇసుక తుపాన్లతో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని దుమ్ము కొట్టుకు పోతోంది. మితిమీరిన కాలుష్యంతో ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని వాతావరణంలో ప్రమాదకర రీతిలో పీఎం (నలుసు పదార్థం) స్థాయులు ఉన్నాయనీ, ఇటువంటి గాలిని పీల్చితే శ్వాసకోస వ్యాధుల బారిన పడే అవకాశం ఉందనీ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దనీ ప్రజలకు సూచించింది. ఎండలు మండిపోతుండడంతో మరో వారంపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దుమ్ము, ధూళితో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజధాని ప్రజలు  33 నుంచి 42 డిగ్రీల ఎండవేడితో చెమటలు కక్కుతున్నారు. కాగా, అక్కడ సాధారణం కన్నా 5 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు