తెలంగాణతో పోటీపడే శక్తి కావాలి

27 Aug, 2014 01:39 IST|Sakshi
తెలంగాణతో పోటీపడే శక్తి కావాలి

 తెలంగాణతో పోటీపడేలా అవకాశాలు కల్పించాలని ప్రధానిని కోరాం: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు
 
 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు ఉన్న అన్ని వెసులుబాట్లూ ఆంధ్రప్రదేశ్‌లోనూ నెలకొంటే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, అందువల్ల సమానంగా పోటీ పడేలా అన్ని అవకాశాలను కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరినట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. అలాగే ఆర్థికమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి కావలసిన ఆర్థిక వనరులు, పరిశ్రమలు, ఇతర తోడ్పాటునందించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఏపీ భవన్‌లో కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, పార్టీ ఎంపీలు సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్, గుండు సుధారాణి, కేశినేని శ్రీనివాస్ తదితరులు కూడా చంద్రబాబు వెంట ఉన్నారు.

‘‘నా పర్యటనలో తొలి రోజు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశాను. తెలంగాణతో సమానంగా ఆంధ్రప్రదేశ్ మనగలిగేలా లెవల్ ప్లేయింగ్ గ్రిడ్ సృష్టించాలని కోరాం. హైదరాబాద్‌లో అన్నీ సమకూరేలా వ్యవస్థ సృష్టించాం. ఐటీ రంగం, ఆసుపత్రులు, హోటళ్లు, ఎయిర్‌పోర్టులు అన్నీ సృష్టించాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవి రావాలి. అందువల్ల.. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వీలైనంత త్వరగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక ప్యాకేజీలు, పన్ను రాయితీలు ఇవ్వాలని ప్రధానిని కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశాం. విభజన బిల్లును తెచ్చింది హోంశాఖే అయినందున ఆ బిల్లులో పొందుపరిచిన అన్ని హామీలను అమలుచేయాల్సిన బాధ్యత కూడా వారిదే. అందుకే అన్ని శాఖలను సమన్వయపరచాలని కోరాం.’’అని చెప్పారు.
 
 ప్రత్యేక హోదా త్వరగా ఇవ్వాలని కోరాం...
 
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు, పన్ను మినహాయింపులు త్వరగా అమలు చేస్తే రాష్ట్రం గాడిన పడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో టెక్స్‌టైల్ క్లస్టర్లు ఏర్పాటుచేయాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరినట్లు చెప్పారు. ‘‘చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లు ఏర్పాటుచేయాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు.’’ అని వివరించారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ను కలిసి.. రాష్ట్రంలో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా పట్టణాలకు ఇంటింటికి పైప్డ్ నాచురల్ గ్యాస్, గ్రామాలకు ఇంటి ంటికీ ఎల్‌పీజీ కనెక్షన్లు అందుబాటులోకి తేవాలని కోరామని చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాదయశోనాయక్‌ను కలిసి.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు సీఎం వివరించారు.
 
 24గంటల కరెంటు..
 
 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని గ్రామాల్లో 24 గంటల కరెంటు, పరిశ్రమలకు నాణ్యమైన వి ద్యుత్తు, వ్యవసాయానికి 7 నుంచి 9 గంటల విద్యుత్తు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని బాబు చెప్పారు. విద్యుత్తు ఆదా కోసం ఎల్‌ఈడీ బల్బులను వినియోగిస్తామని తెలిపారు. పోలవరం అథారిటీ ఏర్పాటు చేసి, ప్రాజెక్టుకు త్వరగా నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తిచేయాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కోరినట్లు చెప్పారు. ఏపీ హైకోర్టును త్వరగా ఏర్పాటుచేయాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కోరామన్నారు. రాజధానిపై మాట్లాడుతూ. ‘‘ప్రజలు నాపై నమ్మకం ఉంచి గెలిపించారు. రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉంటుంది..’’ అని స్పష్టంచేశారు.
 
 మిగులు విద్యుత్తు తెలంగాణకు ఇస్తాం..
 
 ‘తెలంగాణకు విద్యుత్తు విషయంలో సాయం చేయాలని కేంద్రాన్ని కోరిన మీరు పీపీఏలు ఎందుకు రద్దు చేశార’ని ప్రశ్నించగా.. ‘‘రద్దు చేయకపోతే ఎలా? వాళ్లకు మేం ఇవ్వాల్సి వస్తుంది. గ్యాస్ ఆధారితంగా పనిచేయాల్సిన విద్యుత్తు కేంద్రాలన్నీ ప్రస్తుతం కేటాయింపులు లేకుండా నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. అన్ని రకాల సమస్యలు పూర్తయి పూర్తి స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి జరిగి మిగిలితే తెలంగాణకు కూడా పంచుతాం’’ అని చంద్రబాబు బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ముందుకు సాగాలని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని, ఐకమత్యంగా ఉండాలని, ఆ దిశగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తాను కూర్చొని మాట్లాడుకున్నామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
 ఉద్యోగాలివ్వకుంటే భూములు వెనక్కే: మంత్రి పల్లె
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగాలివ్వకుంటే కొత్త కంపెనీలకు కేటాయిస్తున్న భూములను వెనక్కి తీసుకుంటామని ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్న కంపెనీలు మాట నిలబెట్టుకోలేదన్నారు. ఆ విషయమై కమిటీలు వేసి విచారణ చేపట్టామని, ఉద్యోగాలివ్వని కంపెనీలకు నోటీసులు ఇస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఇక్కడ నిర్వహించిన డిజిటల్ ఇండియా సమావేశంలో.. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల అభివృద్ధికి ప్రతిపాదనలు, కొత్త ఐటీ పాలసీ విధానాలను మంత్రి తెలియచేశారు. అనంతరం ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. టెక్ మహీంద్రా, విప్రోలకు భూములు కేటాయిస్తే షరతుల మేరకు వ్యవహరించలేదని తెలిపారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ 10 వేల ఎకరాలు తీసుకుని ఐదేళ్లు అయ్యిందని, ఆ సంస్థ భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.690 కోట్ల రుణం తీసుకుందని అందుకే దానికి నోటీసులు ఇచ్చామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు