‘బ్రేక్‌ పార్టీస్‌.. మేక్‌ పార్టీ’ మీ విధానమా?

11 Jan, 2017 01:35 IST|Sakshi
‘బ్రేక్‌ పార్టీస్‌.. మేక్‌ పార్టీ’ మీ విధానమా?

అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా?
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలకు మీ సమాధానమేంటి?
ఏపీ సీఎం బాబును సూటిగా ప్రశ్నించిన ఇండియాటుడే ప్రతినిధి
దీంతో ఆవేశానికి లోనై పలు పరుష వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, చెన్నై: బ్రేక్‌ పార్టీస్‌.. మేక్‌ పార్టీ మీ విధానమా(పార్టీలను విడగొట్టి.. పార్టీని నిర్మించుకోవడం)? అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో ఏపీ సీఎం చంద్రబాబు ఖంగుతిన్నారు. ‘ఒకవైపు మీరేమో క్లీన్‌ ఇండియా, కరప్షన్‌ ఫ్రీ ఇండియా అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మీపై ఆరోపణలు వస్తున్నాయి కదా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ సందర్భంగా కొంత ఆవేశానికి గురైన చంద్రబాబు పరుషవ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ‘హూ ఈజ్‌ దట్‌ ఫెలో..?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతలోనే తమాయించుకొని క్షమాపణ చెప్పారు. ప్రముఖ చానల్, మ్యాగ్‌జైన్‌ అయిన ఇండియాటుడే చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి మంగళవారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరాయ్‌ విజయన్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ హాజరయ్యారు. వీరందరి సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఇండియాటుడే ప్రతినిధి పలు ప్రశ్నలు సంధించారు. ‘మీరేమో క్లీన్‌ ఇండియా, అమరావతి ఒక ఆదర్శ రాజధాని అని చెబుతున్నారు. అయితే ఏపీలో మీపై చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు.

అంటే మీరు బ్రేక్‌ పార్టీస్, మేక్‌ పార్టీ విధానంతో అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా?’ అని చంద్రబాబును ఆ ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంద ని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని భూసేకరణ అంతా పారదర్శకంగా జరుగుతోందని, తన పిలుపునకు స్పందించి 35 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అప్పగించారని చెప్పారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను సీఆర్‌డీఏ పర్యవేక్షిస్తుండగా రూ.లక్ష కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన దిశగా అమరావతి నిర్మాణం సాగుతోందని పేర్కొన్నారు.

రెండుసార్లు ప్రధాని అవకాశం వచ్చింది..
పెద్ద నోట్ల రద్దును 90 నుంచి 95 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా.. అవినీతిపరులైన 5 శాతం మంది మాత్రమే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ పరమైన ఆర్థిక లావాదేవీలు సైతం చెక్కు రూపేణా నిర్వహించేందుకు తాము సిద్ధమని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలతో సంతృప్తిగా ఉన్నానని, జాతీయస్థాయికి వెళ్లబోనని చంద్రబాబు తెలిపారు. గతంలో తనకు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా నిరాకరించానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు, అన్నాడీఎంకేపై అజమాయిషీ కోసం  సీబీఐ, ఐటీ దాడులను అస్త్రంగా వాడుకోవడం లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. నల్లధన నిర్మూలన అనేది 2014 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలోని అంశమని, దీని కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు