'సాగరమాల'లో పాల్గొన్న చంద్రబాబు

5 Oct, 2015 13:38 IST|Sakshi

న్యూఢిల్లీ : తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సాగరమాల' ప్రాజెక్టు  సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.  ఢిల్లీలో కేంద్ర షిప్పింగ్,రోడ్డు రవాణా,హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సాగరమాల అపెక్స్ కమిటీకిది మొదటి సమావేశం. కాగా దేశవ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా చట్టం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

గడిచిన 30 ఏళ్లలో కేవలం ఐదింటిని మాత్రమే జాతీయ జల రవాణా మార్గాలను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో 1,078 కి.మీ. మేర జల మార్గం ఒకటి. కేంద్రం తాజాగా మరో 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు మార్గాలకు చోటు దక్కింది. కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఒక జాతీయ జల మార్గం, మంజీరా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా మరో మార్గాన్ని కేంద్రం అభివృద్ధి చేయనుంది.
 

మరిన్ని వార్తలు