ఏపీ చేసిన తప్పేంటీ?: చంద్రబాబు

17 May, 2016 18:44 IST|Sakshi
ఏపీ చేసిన తప్పేంటీ?: చంద్రబాబు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానితో పాటు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం ఆయన మంగళవారం సాయంత్రమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ప్రధానితో సమావేశం చాలా బాగా జరిగింది. ప్రధానితో జరిగిన సమావేశంలో నిధులపై దృష్టి పెట్టలేదు. సమావేశం ఇచ్చిన స్ఫూర్తి ముఖ్యం. కరవు మండలాల్లో ఏం చేయాలో అన్నీ చేశాం. మోదీని అదనంగా నిధులు అడగలేదు.

రాష్ట్ర విభజన చట్టంలో సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు అమలు చేశాక కూడా ఏపీకి లోటు ఉంటుంది. రెండేళ్లలో కొన్ని పనులు మాత్రమే జరిగాయి. ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. హోదా ఇచ్చి ఏమీ ఇవ్వకపోతే ఎలా? హోదా ఇచ్చి కేంద్రం ఇక ఏమీ ఇవ్వనంటుంది, అప్పుడు ఏం చేస్తారు...? ఏపీకి ఇచ్చిన హామీకి దేశం మొత్తానికి బాధ్యత. ఒక్క బీజేపీనే కాదు, అన్ని పార్టీలను అడుగుతున్నా.

ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు... పదేళ్లు ఇవ్వాలని బీజేపీ ఆ రోజు కోరింది. తిరుపతి సమావేశంలో నరేంద్ర మోదీ కూడా అదే చెప్పారు. రెండేళ్లలో కొన్ని పనులు జరిగాయి. ఇప్పుడు రెవెన్యూ లోటే ఏపీకి పెద్ద సమస్య. నాగార్జున సాగర్, శ్రీశైలం రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. రెండు బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకూ కేంద్రం దీనిపై దృష్టి పెట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో గొడవలు పడటం సరికాదు. కేంద్రం ప్రభుత్వం తరఫున వ్యక్తులు ఉండాలి. పంపకాలు చేయాలి. అన్ని అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని మోదీ చెప్పారు. సమస్యల పరిష్కారానికి నిర్ణీత గడువు పెట్టాలని కోరాను.

అలాగే ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఏపీ కోలుకోలేదని చెప్పాను. కాంగ్రెస్ చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయడం సరికాదు. కిందస్థాయి బీజేపీ నేతలే ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారు. పైస్థాయిలో ఎవరూ స్పందించడం లేదు. ప్రత్యేక హోదాతో అన్ని రాష్ట్రాలు బాగుపడ్డాయా అంటే అదీలేదు. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా ఏమీ ఇవ్వకపోతే ఎలా. వేరే రాష్ట్రాలకు లేని శిక్ష ఏపీకే ఎందుకు? ఏపీ చేసిన తప్పేంటీ' అంటూ చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాపైన కూడా వ్యాఖ్యలు చేశారు. మీడియా పాజిటివ్ రోల్ ప్లే చేయడం లేదని అన్నారు. అలాగే మీడియాలో మసాలా వార్తలు ఎక్కువ వస్తున్నాయంటూ ఆయన అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా