దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు

13 Feb, 2018 08:57 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు

నివేదిక విడుదల చేసిన ఏడీఆర్‌

న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు ఏడీఆర్‌ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి.

దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది(35శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో తెలిపింది. దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే..మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్‌ సాధించినట్లు పేర్కొంది.  

 

మరిన్ని వార్తలు