జూలై 15న చంద్రయాన్‌2

13 Jun, 2019 03:05 IST|Sakshi
బెంగళూరులో చంద్రయాన్‌–2 ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైన శాస్త్రవేత్తలు

చంద్రుడిపైకి రోవర్‌ పంపుతున్నాం

ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ వెల్లడి

బొమ్మనహళ్లి(బెంగళూరు)/సూళ్లూరుపేట: చంద్రుడిపైకి రెండో మిషన్‌లో భాగంగా చంద్రయాన్‌–2ని జూలై 15న ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్‌ కె.శివన్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 6 లేదా 7వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ దిగుతుందని బుధవారం ఆయన వెల్లడించారు. భారత అంతరిక్ష ప్రయోగాలలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 రాకెట్‌ సాయంతో ఈ మిషన్‌ను ప్రారంభిస్తామని, ఈ ప్రయోగం ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, లాండర్లను చంద్రుడిపైకి పంపనున్నట్లు తెలిపారు.

చంద్రయాన్‌–2 మొత్తం బరువు 3.8 టన్నులని, ఇస్రో ప్రయోగిస్తున్న లాండర్, రోవర్‌ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకోసం ఇస్రో వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 రాకెట్‌ను వాడుతున్నారు. ఆర్బిటర్‌ ప్రొపెలైజేషన్‌ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయి. అక్కడ ఆర్బిటర్‌ నుంచి లాండర్‌ విడిపోయి చంద్రుడివైపు దూసుకెళుతుంది.

ఆర్బిటర్‌ నుంచి లాండర్‌ విడిపోవడం ఈ ప్రాజెక్టులో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. విడిపోయిన అనంతరం ఆర్బిటర్‌ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతుంది. మరోపక్క లాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో దిగుతుంది. లాండర్‌ క్షేమంగా లక్ష్యాన్ని చేరుకున్నాక దానిలోంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ఈ రోవర్‌ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా లాండర్‌ పైభాగంలో అమర్చారు. రోవర్‌ సాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు వంటి వాటిని అన్వేషిస్తారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.1,000 కోట్లుకాగా, చంద్రయాన్‌ –2 కోసం రూ. 603 కోట్లు ఖర్చుకానుంది. ఇందులో జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 కోసం రూ.375 కోట్లు వెచ్చించనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్‌ నుంచి ఇది ఇస్రోకు సంకేతాలను పంపుతుందని శివన్‌ వెల్లడించారు.


బెంగళూరులో మీడియాతో మాట్లాడుతున్న శివన్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు