వడివడిగా మామ చుట్టూ..

21 Aug, 2019 02:51 IST|Sakshi
బెంగళూరులో మీడియాతో మాట్లాడుతున్న ఇస్రో చైర్మన్‌ శివన్‌

విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌–2 మిషన్‌

అంతరిక్ష చరిత్రలో భారత్‌.. తన కోసం మరికొన్ని పుటలను లిఖించుకుంది. చంద్రయాన్‌–2 ప్రయోగంలో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ‘బాహుబలి’ప్రవేశించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌ విజయం సాధించింది. లిక్విడ్‌ ఇంజిన్‌ను మండించడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అర్ధగంట పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ వెల్లడించారు.

ఇప్పటిదాకా జరిగింది ఇదీ..
► ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్‌–2ను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది.

► ఆగస్టు 14న చంద్రుడి కక్ష్యగతి మార్గంలోకి మళ్లించారు.

► ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.

జరగబోయేది ఇదీ..
► సెప్టెంబర్‌ 7న ఉదయం 1.55 గంటలకు ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌ (1,471 కేజీల బరువు) చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది.  

►  ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ విడిపోయి, చంద్రుడిపై అన్వేషణ ప్రారంభిస్తుంది.  

► చంద్రయాన్‌ ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ.. అక్కడి విశేషాలను భూమిపైకి పంపుతూ ఉంటుంది.  
 
వడివడిగా.. చంద్రుడి దిశగా..
సాక్షి, బెంగళూరు/సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానసపుత్రిక చంద్రయాన్‌–2 అంతరిక్ష నౌక చంద్రుడి ఒడిని చేరేందుకు వడివడిగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్‌–2 నౌక కీలకమైన చంద్రుడి కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది.

మంగళవారం ఉదయం 9.02 గంటల ప్రాంతంలో ఆర్బిటర్‌లోని ద్రవ ఇంజిన్‌ను 1,738 సెకన్లపాటు మండించి లూనార్‌ ఆర్బిట్‌లో అంటే చంద్రుడికి దగ్గరగా 114 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 18,072 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ చతురస్రాకారంలో ప్రవేశపెట్టి భారత ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు. బెంగళూరు సమీపంలో బైలాలులోని భూనియంత్రిత కేంద్రం (మిషన్‌ ఆపరేటర్‌ కంట్రోల్‌ సెంటర్‌) నుంచి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ఆధ్వర్యంలో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు.  

తదుపరి ప్రక్రియలకు సన్నాహాలు..
ఇక ప్రయోగంలో తదుపరి 18,072 కిలోమీటర్ల దూరాన్ని 4 విడతలుగా తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి చతురస్రాకారంలో 100 కిలోమీటర్లుకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. తర్వాత 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ వచ్చి సెప్టెంబర్‌ 2వ తేదీన ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ (విక్రమ్‌)ను విడిచిపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఇక ప్రయోగంలో చివరిగా సెప్టెంబర్‌ 7వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల్లోపు ల్యాండర్‌ నుంచి రోవర్‌ (ప్రజ్ఞాన్‌) బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి తన పరిశోధనలను ప్రారంభిస్తుంది.  

దశల వారీగా పరిశీలిస్తే..
జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జూలై 22వ తేదీన చంద్రయాన్‌–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లు ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24వ తేదీ తొలి విడత, 26వ తేదీన రెండోసారి, 29వ తేదీన మూడోసారి, ఈ నెల 2వ తేదీన నాలుగోసారి, 6వ తేదీన ఐదోసారి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని మండించి భూమికి దగ్గరగా 276 కిలోమీటర్లు, భూమికి దూరంగా 1,42,975 కిలోమీటర్లను విజయవంతంగా పెంపుదల చేశారు. ఈ నెల 14వ తేదీన ఆరోసారి లూనార్‌ ఆర్బిట్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌ నౌకను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 6 సార్లు కక్ష్య దూరం పెంచే ఆపరేషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఎలాంటి సాంకేతికపరమైన లోపం లేకుండా విజయవంతంగా నిర్వహించారు.  

ఆ అర్ధగంట.. అత్యంత ఉత్కంఠ..
చంద్రయాన్‌–2 మిషన్‌ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు మా శాస్త్రవేత్తలు ద్రవ ఇంథనాన్ని మండిస్తున్న సమయంలో నా గుండె కాసేపు ఆగినంత పనైంది. సుమారు ఈ ప్రక్రియ చేపడుతున్న అర్ధగంట సమయం అత్యంత ఉత్కంఠను ఎదుర్కొన్నా’అని మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. ల్యాండర్‌ చంద్రుడిపై దిగే సెప్టెంబర్‌ 7వ తేదీన ఇంతకంటే అత్యంత ఉత్కంఠ క్షణాలు ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ అభినందనలు..
చంద్రయాన్‌–2 వ్యోమనౌకను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయాణంలో మరో మైలురాయిని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ముగించారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు