ముందుంది మరో నవోదయం

8 Sep, 2019 04:27 IST|Sakshi

ఇస్రో ఘనతలను చూసి దేశం గర్విస్తోంది

బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి మోదీ

బెంగళూరు: చంద్రయాన్‌ –2 ప్రయోగం చివరి క్షణంలో ఎదురైన అడ్డంకిని చూసి శాస్త్రవేత్తలు నిరాశపడొద్దని, సరికొత్త నవోదయం మరోటి మనకోసం ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌–2లోని విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన క్షణం నుంచే ఇస్రో శాస్త్రవేత్తలను ఊరడించిన ప్రధాని శనివారం ఉదయం ఎనిమిదిగంటలకు వారందరిని కలసి మాట్లాడారు. ‘భారత్‌ మాతా కీ జై’ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టి, ఉత్సాహపరిచేందుకు సాంత్వన వచనాలు పలికారు. లక్ష్యాన్ని సాధించే కొద్ది క్షణాల ముందు వైఫల్యం ఎదురవడం తనకూ తెలుసని, సైంటిస్ట్‌ల భావోద్వేగాలను అర్థం చేసుకోగలనని చెప్పారు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ నిలిచిపోయినపుడు శాస్త్రవేత్తల బాధను చూడలేకే ఇస్రో కేంద్రం నుంచి వెళ్లిపోయానని, ఏదో బోధించడానికి కాకుండా.. మీ నుంచి స్ఫూర్తి పొందేందుకే మళ్లీ ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు.

ఇస్రో సాధించిన గత ఘనతలన్నింటికీ భారత్‌ ఎంతో గర్విస్తోందని, భారత్‌ మీ వెన్నంటే ఉందన్నారు. ‘లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చాం. భవిష్యత్తులో మరింత పట్టుదలతో పనిచేయాలి. ఈ రోజు నేర్చుకున్న పాఠాలు మనల్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తాయి. శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో అసలైన ఘన విజయాలు ముందున్నాయని, కొత్త లక్ష్యదూరాలకు వెళ్లాలని, ఈ ప్రయాణంలో దేశ ప్రజలందరూ ఇస్రో వెన్నంటే ఉన్నారని భరోసా ఇచ్చారు. చంద్రయాన్‌ –2 సక్సెస్‌ కోసం శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా విలువైందని కొనియాడారు.

విక్రమ్‌ జాబిల్లిని కౌగిలించుకుంది..
కవులు, కథల్లో జాబిల్లిని భావాత్మకంగా వర్ణించారని, బహుశా విక్రమ్‌ వీటి ప్రభావానికి లోనై, చివరి క్షణాల్లో జాబిల్లిని కౌగిలించుకుని ఉంటుందని మోదీ చమత్కరించారు. ఈ సంఘటన జాబిల్లిని అందుకోవాలన్న మన సంకల్పాన్ని దృఢం చేసిందన్నారు. ల్యాండర్‌తో సమాచారం తెగిపోయిందని తెలీగానే మీరంతా భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, ఈ వైఫల్యం తాత్కాలికం మాత్రమేనని భవిష్యత్‌ విజయాలకు శక్తినిచ్చే విషయమన్నారు. ‘సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు. ప్రయత్నాలు, ప్రయోగాలే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు