జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

17 Jul, 2019 20:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని ఇస్రో బృందం తెలిపింది. జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2ను గగనతలానికి పంపనున్నట్లు పేర్కొంది. చంద్రయాన్‌ 2ను చంద్రుడిపైకి ప్రయోగించడానికి జూలై మొదటివారంలో నిర్ణయించుకున్నప్పటికీ అది జూలై 15కు వాయిదా పడింది. ఆ తర్వాత సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని నిలిపివేశారు. అప్పటికప్పుడు సమస్య పరిష్కరించడం సాధ్యం కానందున చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కాగా గతంలో చంద్రునిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్‌1ను పరీక్షించారు. ఇది చంద్రుని చుట్టూ 3,400 సార్లు తిరగగా 312 రోజలపాటు అంటే 2009 ఆగస్టు 29 వరకు విజయవంతంగా పని చేసింది. చంద్రయాన్‌ 1ను పరీక్షించిన 11 సంవత్సరాలకు చంద్రుడిపై ప్రయోగానికి ఇస్రో మళ్లీ సిద్ధమైంది. చంద్రుని దక్షిణ ధృవాన్ని అన్వేషించడానికి ఈ ప్రయోగం చేపడుతున్నారు. చంద్రయాన్‌ 2లో బాహుబలిగా పిలుచుకునే జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 రాకెట్‌ను వాడుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.978 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రయాన్‌ 2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి దాదాపు 54 రోజులు పడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై వ్యోమనౌకను ప్రవేశపెట్టిన 4వ దేశంగా భారత్‌ ఘనత సాధించనుంది. ఈ విషయంలో అమెరికా, రష్యా, చైనా ముందు స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు