చంద్రయాన్‌–2తో కథ ముగియలేదు

3 Nov, 2019 04:27 IST|Sakshi
ఇస్రో చీఫ్‌ శివన్‌

ఇస్రో చీఫ్‌ కె.శివన్‌

న్యూఢిల్లీ: చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో విఫలమైన చంద్రయాన్‌ –2 తో కథ ముగియలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సన్నద్ధం అవుతోందని ఇస్రో చీఫ్‌ శివన్‌ తెలిపారు. ఢిల్లీ ఐఐటీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న శివన్‌ రాబోయే మరికొద్ది నెలల్లో మరింత అభివృద్ధి చెందిన అంతరిక్ష పరిశోధనలు చేయబోతున్నట్టు తెలిపారు. చంద్రయాన్‌–2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయలేకపోయాం. అయితే జాబిల్లి ఉపరితలంపై 300 మీటర్ల దూరం వరకు సాంకేతికంగా అన్ని వ్యవస్థలూ సరిగ్గానే పనిచేశాయి.

చంద్రయాన్‌–2 నుంచి గుణపాఠాలను తీసుకుని భవిష్యత్‌లో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేస్తామని హామీ ఇస్తున్నానని శివన్‌ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌లాంటి భవిష్యత్‌ ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శివన్‌ చంద్రయాన్‌–2 తో కథ అంతంకాలేదనీ, ఆదిత్య ఎల్‌–1 సోలార్‌ మిషన్, మానవ స్పేస్‌ఫ్లైట్‌ ప్రోగ్రామ్స్‌ ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. మీకు నైపుణ్యం, ఆసక్తి ఉన్న రంగంలో ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకుని ముందుకుసాగాలని విద్యార్థులకు శివన్‌ సూచించారు. అయితే విజయం సాధించడమన్నది కేవలం అభిరుచిపైనే ఆధారపడి ఉండదనీ, విజయానికి అభిరుచి దోహదపడగలదని మాత్రమే గుర్తించాలని అన్నారు.

మరిన్ని వార్తలు