చంద్రయాన్‌ 98% సక్సెస్‌

22 Sep, 2019 03:23 IST|Sakshi
భువనేశ్వర్‌లో మాట్లాడుతున్న శివన్‌

ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించలేకపోయాం

ఆర్బిటర్‌ బాగా పనిచేస్తుందన్న ఇస్రో చైర్మన్‌ శివన్‌

చెన్నై/భువనేశ్వర్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. చంద్రయాన్‌–2లో అమర్చిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు మాత్రం పునరుద్ధరించలేకపోయినట్లు తెలిపారు. ల్యాండర్‌కి ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ విశ్లేషణ చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ల్యాండర్‌ నుంచి తమకు ఎలాంటి కమ్యూనికేషన్‌ లేదని.. ఒకవేళ ఏదైనా సమాచారం అందితే దానికి తగినట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చంద్రయాన్‌–2లో ఆర్బిటర్‌ మాత్రం చాలా బాగా పని చేస్తోందని పేర్కొన్నారు. ఆర్బిటర్‌లో అమర్చిన ఎనిమిది సాంకేతిక పరికరాలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రతి పరికరం తన పనిని తాను సమర్థవంతంగా చేస్తోందని చెప్పారు. ఆర్బిటర్‌ పంపిన కొన్ని చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని.. ఇవి పరిశోధనల్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆయన భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బిటర్‌ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా 2020లో చేపట్టనున్న చంద్రుడిపై చేపట్టనున్న మరో మిషన్‌ మీదే అని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పారు.  

గగన్‌యాన్‌పై దృష్టి..
చంద్రయాన్‌–2 ఫలితం ప్రభావం గగన్‌యాన్‌ ప్రయోగంపై ఉండబోదని శివన్‌ స్పష్టం చేశారు. గగన్‌యాన్‌ ప్రయోగం భారత్‌కు చాలా ముఖ్యమని.. ఇది దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి గగన్‌యాన్‌ ప్రయోగంపై దృష్టి సారించామని వెల్లడించారు. ఐఐటీ భువనేశ్వర్‌లో జరిగిన ఎనిమిదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2021 డిసెంబర్‌ కల్లా భారత్‌ తన సొంత రాకెట్‌లో వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. 2020 డిసెంబర్‌ కల్లా మానవ రహిత అంతరిక్ష విమానాన్ని అంతరిక్షంలోకి పంపుతామని పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌లో రెండో విమానాన్ని పంపుతామని చెప్పారు.

మరిన్ని వార్తలు