చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

27 Jul, 2019 03:20 IST|Sakshi
భూమధ్యంతర కక్ష్యలో ఉన్న చంద్రయాన్‌–2 మిషన్‌

విజయవంతంగా రోదసీలో ప్రయాణం

సూళ్లూరుపేట:  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ కేంద్రం నుంచి ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్‌–2 మిషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం 1.08 రెండో విడత కక్ష్యదూరాన్ని విజయవంతంగా పెంపుదల చేశారు. బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న భూనియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌–2 మిషన్‌లో భాగంగా ఉన్న  ఆర్బిటర్‌లో నింపిన ఇంధనం సాయంతో కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు గాంచిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా చంద్రయాన్‌–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లు ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా ఈ నెల 24వ తేదీన మొదటి విడత పెంపుదలలో భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్ల వరకు దూరం పెంచారు. శుక్రవారం రెండోసారి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని 883 సెకెన్లపాటు మండించి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని ఒక్కసారిగా 54,829 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 దాకా మూడోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు. ఈ సారి భూమికి దగ్గరగా  ఉన్న 230 కిలోమీటర్లు దూరాన్ని 268 కిలోమీటర్లకు, భూమికి దూరంగా  ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,558 కిలోమీటర్ల దూరానికి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు