నిప్పులు చిమ్ముతూ...

23 Jul, 2019 04:53 IST|Sakshi
సోమవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికేగుతున్న జీఎస్‌ఎల్వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌

దిగ్విజయంగా నింగిలోకి  చంద్రయాన్‌–2

తొలిదశ విజయవంతమైంది: ఇస్రో

గగనం గెలిచాం.. థాంక్స్‌ ఇస్రో!

జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్‌ 2 తొలి అడుగు విజయవంతంగా పడింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3 ఎం 1  రాకెట్‌.. చంద్రయాన్‌ 2ను నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక.. సెప్టెంబర్‌ 7న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండర్‌ను దింపడమనే మలి అడుగు కోసం మానవాళి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ఇస్రో మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది.

శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి ప్రతినిధి, అమరావతి: చంద్రుణ్ని చేరుకునే ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. బాహుబలిగా పిలిచే, 640 టన్నుల బరువుండే జీఎస్‌ఎల్వీ–మార్క్‌3–ఎం1 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌–2ను విజయవంతంగా భూ కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. 3,850 కేజీల బరువున్న చంద్రయాన్‌–2ను సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండో వేదిక నుంచి నింగికి పంపారు.

ప్రయోగం సమయంలో మేఘావృతమై ఉన్న ఆకాశంలోకి రాకెట్‌ నారింజ, పసుపు వర్ణాల్లో నిప్పులు చిమ్ముతూ ఎగిరింది. సరిగ్గా 16.14 నిమిషాల్లో చంద్రయాన్‌–2 మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి రాకెట్‌ ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఎంతో ఉత్కంఠతో ఊపిరిబిగబట్టుకుని కూర్చున్న శాస్త్రవేత్తలు, తొలిదశ విజయవంతమైందన్న ప్రకటనతో ఒక్కసారిగా హర్షధ్వానాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నెల 15న తెల్లవారుజామున 2.51 గంటలకే చంద్రయాన్‌–2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. రాకెట్‌లోని మూడో దశ క్రయోజనిక్‌లో పోగో గ్యాస్‌ బాటిల్స్‌ నుంచి క్రయోఇంజిన్‌ ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయట ప్రాంతంలో లీకేజిని గుర్తించి ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే లోపాన్ని సరిచేశారు.  48 రోజుల పాటు లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం సెప్టెంబర్‌ 7న ఈ ఉపగ్రహం జాబిల్లిపై అడుగుమోపనుంది.

టెన్షన్‌.. టెన్షన్‌
చంద్రుడిపైకి మొట్టమొదటిగా ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్, ల్యాండర్‌లో అమర్చిన రోవర్‌ ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరిలో ఎడతెగని టెన్షన్‌.. ఈ భారీ ప్రయోగంపైనే అందరి ధ్యాస. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 20 గంటలు ముగిసే సమయం దగ్గర పడింది. షార్‌లోని మీడియా సెంటర్, మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని మైక్‌లలో 6.. 5.. 4.. 3.. 2.. 1.. 0 అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపునకు మళ్లాయి. క్షణాల్లో ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను చీల్చుకుంటూ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక చంద్రయాన్‌–2ను మోసుకుని నింగివైపుకెళ్లింది.

మిషన్‌ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు కంప్యూటర్లను ఆపరేట్‌ చేస్తూ రెప్ప వాల్చకుండా రాకెట్‌ గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒక్కో దశ విజయవంతంగా దూసుకుపోవడంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు. ఇలా మూడు దశలను సమర్థవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్‌–2ను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో మిషన్‌ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. చంద్రయాన్‌–2 భూ కక్ష్యలోకి చేరిందనీ, అంతా సవ్యంగా సాగుతోందని బెంగళూరులోని ఇస్రో మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రకటించింది.శ్రీహరికోట నుంచి చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 75వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.

ప్రయోగం ఇలా జరిగింది..
మొత్తం 3,850 కేజీల బరువైన చంద్రయాన్‌–2 మిషన్‌లో 2,379 కేజీల బరువైన ఆర్బిటర్, 1,471 కిలోల బరువు కలిగిన ల్యాండర్‌ (విక్రమ్‌), 27కేజీల బరువైన రోవర్‌ (ప్రజ్ఞాన్‌) ఉన్నాయి. ఇందులో మొత్తంగా 13 పేలోడ్లు ఉండగా, వాటిలో 3 యూరప్‌వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. నాసాకు చెందిన లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ ఎరే (ఎల్‌ఆర్‌ఏ) కూడా వాటిలో ఓ పే లోడ్‌. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ మొదటి దశలో ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్‌–200 బూస్టర్ల సాయంతో నింగికి తన ప్రయాణాన్ని దిగ్విజయంగా ప్రారంభించింది.

ఈ దశలో రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 132.7 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో ఎల్‌–110 అంటే ద్రవ ఇంజిన్‌ మోటార్లు 110.84 సెకన్లకే స్టార్ట్‌ అయ్యాయి. 205 సెకన్లకు రాకెట్‌ శిఖరభాగాన అమర్చిన చంద్రయాన్‌–2 మిషన్‌కు ఉన్న హీట్‌షీల్డ్స్‌ విజయవంతంగా విడిపోయాయి. ఇక్కడ 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 307 సెకన్లకు రెండో దశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.

క్రయోజనిక్‌ (సీ–25) మోటార్లు 311.22 సెకన్లకు మండించి 978 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేశారు. ఈ దశ నుంచి రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్‌–ఒన్‌ చంద్రయాన్‌–2 మిషన్‌ను క్రయోజనిక్‌ దశతో 978.8 సెకన్లకు (16.55 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 40,000 కి.మీ. ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్‌ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

రాకెట్‌ గమన తీరు అత్యంత సజావుగా సాగడంతో అపోజిని మరో 6,000 కి.మీ. దూరం ముందుకు పంపించి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ తన సత్తాను చాటుకుంది. అంటే 46,000 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లారు. దీనివల్ల చంద్రయాన్‌–2 కాలపరిమితి పెరగడమే కాకుండా ఆర్బిట్‌ రైజింగ్‌ ప్రక్రియ తగ్గింది. దీంతోచంద్రయాన్‌–2లో ఉన్న ఇంధనం కూడా ఆదా అయ్యి దాని జీవిత గమనం పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటినుంచి చంద్రుడిపైకి వెళ్లే వరకు మిషన్‌ను బెంగళూరులోని మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనే పూర్తి చేస్తారు.

చంద్రుడిపైకి ఇలా...
ముందుగా 16 రోజుల్లో ఆర్బిటర్‌లో నింపిన ఇంధనాన్ని మండించి అపోజిని 46,000 కి.మీ. నుంచి 1,41,000 కి.మీ.కు పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి 4సార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్‌ ద్వారా చంద్రుడివైపు ప్రయా ణం చేసేందుకు మళ్లిస్తారు. అనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూ రెట్రోబర్న్‌ చేసి వంద కి.మీ. వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి 4సార్లు ఆపరేషన్‌ చేపడతారు. 100 కి.మీ. నుంచి 30 కి.మీ. ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత ల్యాండర్‌ను 15 నిమిషాలు మండించి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దించే ప్రక్రియను చేపడతారు.

ఆ 15 నిమిషాలు...
చంద్రయాన్‌–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్‌–2లోనూ ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రు డిపై దించే ప్రక్రియను కొత్తగా రూపొందించారు. ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్‌ ఎవరూ చేయలేదు. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొదటిసారిగా థొరెటల్‌–అబల్‌ అనే లిక్విడ్‌ ఇంజిన్‌లను ఉపయోగించనున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ మృదువైన  చోట ల్యాండ్‌ అయిన తరువాత ల్యాండర్‌ తలుపులు తెరుచుకోకుంటే ల్యాండర్‌ తలుపు బయటకొచ్చేలా డిజైన్‌ చేశారు. ల్యాండర్‌ నుంచి రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై రావడానికి 4 గంటల సమయం తీసుకుంటుంది. తొలిసారిగా చంద్రు ని దక్షిణ ధృవంపై అడుగుపెడుతున్న దేశంగా భారత్‌ రికార్డులకు ఎక్కనుంది.

14 రోజుల్లో 500 మీటర్లు
రోవర్‌ సెకెండ్‌కు ఒక సెంటీమీటర్‌ వేగంతో కదులుతుం ది. రోవర్‌ ఒక లూనార్‌ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమి మీద మనకు 14 రోజులు. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్‌ నాలుగోది.ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఇప్పుడు చంద్రయాన్‌–2 పేరుతో చంద్రుడి ఉపరితలంపైకి ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్‌ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంగా నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఈ ఘనత సాధించాయి. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్‌ ఒన్‌ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చందమామ కథ ఇదీ..
అంతరిక్షంపై పట్టు బిగించడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేసింది. అపోలో మిషన్‌ ద్వారా చంద్రలోకంపైకి తొలి అడుగు వేసింది. ప్రాజెక్టు జెమినీ ప్రారంభించి అపోలోకు సాంకేతికపరంగా కొత్త హంగులు అద్దడానికి కృషి చేసింది. మొదట్లో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. అపోలో–1 ప్రయోగం విఫలమై ముగ్గురు వ్యోమగాములు మృతి చెందారు. ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేసింది. మొత్తంగా 6,300 టెక్నాలజీలపై ఆధిపత్యం సాధించింది. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అపోలో–11ను ప్రయోగించింది.

1969 జూలై 16న నాసా కేప్‌ కేనర్‌వాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్‌–5 రాకెట్‌ ద్వారా అపోలో–11 నింగికి ఎగిసింది. ఈ ప్రయోగం జరిగిన 3 రోజుల తర్వాత అపోలో–11 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 20న జాబిల్లిపై నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ఆరు గంటల పైగా తేడాతో లూనార్‌ మాడ్యూల్‌ పైలట్‌ బజ్‌ అల్డ్రిన్‌ జాబిల్లిపైకి దిగారు. ఇద్దరు వ్యోమగాములు జాబిల్లిపై 21.38 గంటలు గడిపారు. 21.7 కేజీల మట్టి, రాతి నమూనాలను సేకరించారు. జూలై 22న లూనార్‌ మాడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత అపోలో భూమికి తిరుగు ప్రయాణమైంది. 1969 జూలై 24న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి వచ్చారు.

ఇక సూర్యుడిపై... 2020లో ఆదిత్య ఎల్‌1 ప్రయోగం  
న్యూఢిల్లీ: చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై దృష్టి సారించింది. సూర్యుడి ఉపరితలంపై కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ‘కరోనా’ను అధ్యయనం చేసేందుకు ‘ఆదిత్య –ఎల్‌1’ అనే వ్యోమనౌకను ప్రయోగించనుంది. 2020 ప్రధమార్థంలో ఈ ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో తెలిపింది. ‘సూర్యుడి ఉపరితంలపై సాధారణంగా 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి బాహ్య ఉపరితల ప్రాంతమైన ‘కరోనా’లో 9.99 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. కరోనాలో ఇంతభారీగా ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజాగా మేం ప్రయోగించనున్న ఆదిత్య–ఎల్‌1 నౌక కరోనాతో పాటు ట్రోపోస్పియర్, ఫొటోస్పియర్, సూర్యుడి నుంచి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది’ అని ఇస్రో వెల్లడించింది. వాతావరణ మార్పులపై కరోనా గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. భూమికి సూర్యుడు 14.96 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.

చంద్రయాన్‌–1తో పరిశోధనలిలా..
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2007 దాకా వివిధ రకాలైన రాకెట్ల ద్వారా రిమోట్‌ సెన్సింగ్, సమాచారం, వాతావరణ పరిశోధన, ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలు మాత్రమే చేస్తూ వచ్చింది. గ్రహాంతర ప్రయోగాలు చేయాలని నిశ్చయించుకుని 2008లో చంద్రయాన్‌–1 ప్రయోగాన్ని పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా చేపట్టింది. ఆ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేసింది. అయితే చంద్రయాన్‌–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసే లా రూపొందించారు.

అయితే, అందులో పంపిన పరికరాలు పది నెలలకే పనిచేయడం మానేశాయి. అంటే చంద్రయా న్‌–1 పది నెలలు పనిచేసిన తరువాత సాంకేతికపరమైన లోపంతో పనిచేయడం మానేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి ఇస్రో చరిత్ర సృష్టించి ంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టి చంద్రుడిపై పరిశోధనలు జరిపింది. చంద్రయాన్‌–1 మిషన్‌ పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్‌–2 మిషన్‌ను ప్రయోగించారు.

ఇస్రోకు నాసా అభినందనలు
చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా అభినందనలు తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఇస్రో వెలుగులోకి తెచ్చే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తామని తెలిపింది. ‘చంద్రునిపై అధ్యయనానికి చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు. విశ్వాంతరాళంలో ఉన్న మా సాంకేతిక వనరులను మీకు సాయంగా అందించడానికి గర్విస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువం గురించి మీరు కనుగొనే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మేం కూడా ఆర్టిమిస్‌ మిషన్‌ ద్వారా ఆ ప్రాంతంలోకి వ్యోమగాములను పంపనున్నాం’ అని ట్విట్టర్‌లో నాసా పేర్కొంది.

చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతం కావడం దేశ ప్రజలందరికీ గర్వించదగ్గ క్షణం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు.  
– ట్విట్టర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ఇది ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం. సాంకేతిక కారణాలతో గత వారం ఈ ప్రయోగం వాయిదాపడినా.. వారంలోనే విజయవంతంగా ప్రయోగం పూర్తి చేశారు. మీకు (ఇస్రో శాస్త్రవేత్తలకు) అభినందనలు.
 – ట్విట్టర్‌ ఆడియో సందేశంలో మోదీ
గర్వంగా ఉంది. ఇందులో ప్రయోగించిన అన్ని  సాంకేతిక పరికరాలను భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ చరిత్రాత్మక ప్రయాణం మొదలైంది.
– డాక్టర్‌ కె.శివన్, ఇస్రో చైర్మన్‌


Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు