ఈ-ఆఫీస్ గా మార్చేయండి..ప్రధాని అవార్డు పట్టేయండి!

16 May, 2016 01:29 IST|Sakshi
ఈ-ఆఫీస్ గా మార్చేయండి..ప్రధాని అవార్డు పట్టేయండి!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖల కార్యాలయాలు ఇకనుంచి కాగిత రహిత కార్యాలయాలుగా(ఈ-ఆఫీస్) మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఈ ఆఫీస్ నిర్వహణలో అత్యుత్తమ   పనితీరు కనబరిచే శాఖకు ఏటా పౌరసేవల దినోత్సవం నాడు ప్రధాని అవార్డుతో సత్కరించనున్నారు. ‘ఈ-ఆఫీసు ఏర్పాటుతో పరిపాలన వేగవంత మవుతుందని..ఫలితంగా ప్రభుత్వ ఖజానాను ఆదా చేసినవారమవుతామ’ని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన, బాధ్యతాయుతమైన పాలనను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా మార్చడం ద్వారా ఆ లక్ష్యానికి చేరవవుతామని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధామంత్రి లక్ష్యమైన ‘ప్రగతి’ని చేరుకునేందుకు ఈ-ఆఫీసు ఏర్పాటు అమలుకు పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆర్థికసాయం చేస్తుందని సింగ్ వెల్లడించారు. ఈ-ఆఫీసు ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ వరుసలో ముందుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ-ఆఫీసుగా మారి లక్ష్యాన్ని చేరుకుంటున్న దశలో...ఇప్పుడు  కేంద్ర పంచాయతీ రాజ్  శాఖ ఈ ఆఫీసుగా మారి ఆ లక్ష్యాన్ని చేరుకోనుంది.

మరిన్ని వార్తలు