రాష్ట్ర గీతంలో మార్పు  

27 Jun, 2018 13:19 IST|Sakshi
నిరసన చేస్తున్న అమ్మె ఒడియా

భువనేశ్వర్‌: రాష్ట్ర గీతమైన వందే ఉత్కళ జనని గీతంలో ఉత్కళ బదులుగా ఒడిశా అని సవరించాలని రాష్ట్ర కార్మిక, విద్యుత్‌ శాఖ మంత్రి సుశాంత సింగ్‌ మంగళవారం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో రాష్ట్రంలో నిరసనల వెల్లువ అకస్మాత్తుగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ కోరాలంటూ ఆందోళన ప్రారంభమైంది.

అమ్మె ఒడియా సంస్థ వందే ఉత్కళ జనని గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని ఇటీవల ఉద్యమించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టింది. త్వరలో ఈ నేపథ్యంలో తుది నిర్ణయం వెలువడనుంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమ ఒడిశాకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక, విద్యుత్‌ శాఖ మంత్రి సుశాంత సింగ్‌ గీతంలో సవరణకు ప్రతిపాదించి మంత్రి ప్రాంతీయ వివక్ష ప్రేరేపిస్తున్నారని అమ్మె ఒడియా సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

జాతీయ గీతంలో రాష్ట్రాన్ని  ఉత్కళగా ఉచ్ఛరించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రాంతీయ పార్టీ ప్రతినిధి కావడంతో ప్రాంతీయ వివక్షను ప్రదర్శిస్తున్నట్లు ఎద్దేవా చేసింది. మంత్రి ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంగళవారం స్థానిక మాస్టర్‌ క్యాంటీన్‌ ఛక్‌ ప్రాంతంలో అమ్మె ఒడియా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

మంత్రి బేషరతుగా తన ప్రతిపాదనల పట్ల క్షమాపణ కోరాలని ఈ వర్గం పట్టుబడుతోంది. మంత్రి వ్యాఖ్యలు నాలుగున్నర కోట్ల రాష్ట్ర ప్రజానీకం మనోగతాలకు కష్టం కలిగించాయని అమ్మె ఒడియా సంస్థ సమన్వయకర్త నిరాకర్‌ సాహు ఆవేదన వ్యక్తం చేశారు. 

సార్వత్రిక ఆమోదం కోసం ప్రతిపాదన: మంత్రి

రాష్ట్ర గీతంగా ప్రకటించనున్న వందే ఉత్కళ జనని గీతంలో ఉత్కళ బదులుగా ఒడిశా అని సవరిస్తే సార్వత్రిక ఆమోదం, ప్రాచుర్యం లభిస్తుందని  రాష్ట్ర కార్మిక, విద్యుత్‌ శాఖ మంత్రి సుశాంత సింగ్‌ తెలిపారు. ఈ గీతం పురాతనమైనది. పశ్చిమ ఒడిశా ప్రాంతంలో కోశల రాజ్యం కోసం ఉద్యమిస్తున్న వర్గాల మనోగతం దృష్ట్యా ఈ ప్రతిపాదన చేసినట్లు మంత్రి వివరించారు.

పశ్చిమ ఒడిశా ప్రతినిధిగా ప్రాంతీయుల మనోభావాల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడం కర్తవ్యంగా భావించి వందే ఉత్కళ జనని బదులుగా వందే ఒడిశా జననిగా సవరించేందుకు ప్రతిపాదించినట్లు ప్రకటించారు. ఇలా అయితే సర్వత్రా ప్రాచుర్యం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అభిప్రాయం, కార్యాచరణకు సంబంధించి తనకు ఎటువంటి అవగాహన లేనట్లు మంత్రి స్పష్టం చేశారు.

పశ్చిమ ఒడిశా ప్రాంతీయుల అభిప్రాయం ప్రకారం ఉత్కళ పదానికి భావం భిన్నంగా ఉన్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వీరి అభిప్రాయం ప్రకారం సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

నిర్ణయం ఖరారు : బీజేడీ అధికార ప్రతినిధి

వందే ఉత్కళ జనని రాష్ట్ర గీతం ప్రతిపాదనపట్ల ప్రభుత్వ నిర్ణయం ఖరారైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తి భావ వ్యక్తీకరణకు రాజ్యాంగపరంగా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ప్రతిపాదనలో పొరపాటు లేనట్లు బిజూ జనతా దళ్‌ అధికార ప్రతినిధి ప్రతాప్‌ కేశరి దేవ్‌ సర్ది చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, ప్రాంతాల ప్రజా ప్రతినిధుల సంప్రదింపుల మేరకు రాష్ట్ర అసెంబ్లీలో వందే ఉత్కళ జనని రాష్ట్ర గీతం ప్రతిపాదనపట్ల తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రతాప్‌ కేశరి దేవ్‌ వివరించారు. ఈ నిర్ణయం వాస్తవ కార్యాచరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపడుతుందని వివరించారు.   

మరిన్ని వార్తలు