ద్రవాహారం నుంచి..

19 Jan, 2020 02:26 IST|Sakshi

అంతరిక్షంలో అడుగు మోపిన మొదటి వ్యక్తి రష్యాకి చెందిన యూరీ గగారిన్‌. 1961లో మొదటిసారి స్పేస్‌కి వెళ్లిన ఆయన అక్కడ ఏం తిన్నారు? ఎలా తిన్నారనే దానిపై అప్పట్లో తెగ ఆసక్తి ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడున్న స్థాయిలో లేకపోవడంతో ఆ నాటి రోజుల్లో శరీరానికి అవసరమయ్యే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ద్రవరూపంలోకి మార్చి ట్యూబ్స్‌లో నింపి ఇచ్చేవారు. ద్రవరూపంలో ఉండే బీఫ్, లివర్‌ని గగారిన్‌ తిన్నారు. ఏవో ఒకట్రెండు పదార్థాలు మాత్రమే పంపేవారు. అదీ ట్యూబ్స్‌ నుంచి తీసుకువెళ్లడమే. అంతకు మించి ఏం తినా లన్నా ఉండేది కాదు. కానీ ఆ తర్వాత రోజుల్లో చాక్లెట్‌ సాస్‌లు కూడా వ్యోమగాముల మెనూలో చేరాయి. ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో వ్యోమగాములకు సిద్ధం చేయబోయే మెనూ చూస్తే కళ్లు చెదురుతాయి. ఏకంగా 24 నుంచి 30 రకాల ఆహార పదార్థాల్ని పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

వీటిలో ఎక్కువగా శాకాహారమే ఉంది. వెజిటబుల్‌ రోల్స్, ఎగ్‌ రోల్స్, ఇడ్లీ, సాంబార్, కొబ్బరి పచ్చడి, పెసరపప్పు హల్వా, వెజిటబుల్‌ పులావ్‌ వంటివి మెనూలో ఉన్నాయి. మైసూరులోని డిఫెన్స్‌ ఫుడ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్‌) ఆహార పదార్థాలను సిద్ధం చేస్తోంది. ఇవి నిల్వ ఉండేలా ప్యాకేజీ చేస్తారు. వీటితో పాటు హీటర్‌ కూడా ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో ఆహార పదార్థాలను వేడి చేసుకొని తినడమే. ఇక ఎక్కువ కారం తినేవారి కోసం అదనపు మసాలా సాచెట్స్‌ కూడా పంపించనున్నారు. మొత్తమ్మీద గత 60 ఏళ్లలో ఫంక్షన్లలోనే కాదు, అంతరిక్షంలో కూడా మెనూలో భారీగా మార్పులొచ్చేశాయి. 

మరిన్ని వార్తలు