-

అదంతా అబద్ధాల మూట..

28 Mar, 2014 03:28 IST|Sakshi
అదంతా అబద్ధాల మూట..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోడీ ధ్వజం
 గత హామీల అమలుపై నిలదీయండి
 ఫైళ్ల క్లియరెన్స్‌కు ‘జయంతి’ ట్యాక్స్ కట్టాలి
 నితీశ్, యూపీఏ వల్లే బీహార్ వెనుకబాటు
 
 గుమ్లా (జార్ఖండ్)/ ససారాం (బీహార్): కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక అబద్ధాల మూట అని పేర్కొన్నారు. 2004, 09 మేనిఫెస్టోల్లో పెట్టి అమలు చేయని హామీలనే మళ్లీ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారన్నారు. గురువారం గుమ్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయనీ విమర్శలు చేశారు. రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోలు గీత, బైబిల్, ఖురాన్‌లాంటివని, వాటితో ప్రజలను ఏమార్చకూడదని మోడీ అన్నారు.
 
 దరల పెరుగుదలను అరికడతామని, కుటుంబానికో ఉద్యోగమిస్తామని గతంలోఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని చెప్పారు. ఆ మేనిఫెస్టోల్లో ఎన్నింటిని, ఎప్పుడు అమలుపర్చారో, వాటి ఫలితాలేమిటో బహిర్గతం చేయాలంటూ కాంగ్రెస్‌ను నిలదీయండని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని చెబుతూ.. ఢిల్లీలో సేల్స్ ట్యాక్స్, ఇన్‌కమ్‌ట్యాక్స్ లాగే ఫైళ్లకు మోక్షం కలగాలంటే జయంతి ట్యాక్స్ కూడా కట్టాలని మాజీ మంత్రి జయంతి నటరాజన్‌పై వ్యంగ్య వాగ్బాణాలు సంధించారు. అనంతరం బీహార్‌లోని సస్రాం సభలో మాట్లాడుతూ.. బీహార్ వెనుకబాటుతనానికి రాష్ర్టంలో నితీశ్, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాలే కారణమన్నారు.
 
 గన్నులు కాదు, పెన్నులు పట్టుకోవాలి..
 హింసను విడనాడాలని మోడీ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. యువకుల చేతుల్లో పెన్నులో లేదా నాగళ్లో ఉండాలని తాను కలలు కన్నానని, ఆ చేతుల్లో గన్నులు ఉండకూడదని అన్నారు. మహాత్మాగాంధీ అహింసాసిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని యువత తుపాకులను విడనాడాలని కోరారు. కాగా, వడోదరాలో మోడీపై పోటీకి తపస్ దాస్ గుప్తాను సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఫర్ ఇండియా-కమ్యూనిస్ట్ (సుసీ-సి) బరిలోకి దింపుతోంది.
 
 అది దురదృష్టం: పాకిస్థాన్
 భారత్‌లో తమ దేశం ఒక ఎన్నికల అంశం అయిపోయిందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం ఆస్లాం ఆవేదన వ్యక్తం చేశారు. అది దురదృష్టకరమన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై మోడీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
 
 మోడీ సభలో చెప్పులు, రాళ్లు
 నరేంద్ర మోడీ గురువారం గయలో నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. గయలోని గాంధీ మైదానంలో నిర్వహించిన సభకు మోడీ రాక ఆలస్యం కావడంతో అప్పటికే వేచిఉన్న జనం విసిగిపోయారు. మోడీ వేదికపైకి వస్తుండగా తోపులాట మొదలై.. చెక్క బారికేడ్లు విరిగిపోయాయి. కొంత మంది మీడియాకు కేటాయించిన ప్రాంతంలోకి కూడా చొచ్చుకొచ్చారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీచార్జి చేయబోగా.. కొందరు వారిపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఎట్టకేలకు బీజేపీ నాయకులు పదే పదే విజ్ఞప్తి చేసి ప్రజలను శాంతింపజేయడంతో పరిస్థితి దారికొచ్చింది.
 
 
 గయలో చెలరేగిన మావోలు
 గయ(బీహార్): నరేంద్ర మోడీ గురువారం ఎన్నికల ర్యాలీ నిర్వహించ తలపెట్టిన బీహార్‌లోని గయ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శక్తిమంతమైన బాంబులు పెట్టి రెండు మొబైల్ టవర్లను పేల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక దుమారియా బజార్, మంరలి గ్రామాల్లోకి ప్రవేశించిన వంద మంది మావోయిస్టులు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన రెండు మొబైల్ టవర్లను పేల్చివేశారని, ఇందుకు శక్తిమంతమైన బాంబులు వాడారని దర్యాప్తులో తేలినట్లు ఎస్పీ నిషాంత్ తివారీ తెలిపారు. ఇటీవల ఛాత్రా జిల్లాలో పది మంది మావోయిస్టులను కాల్చి చంపడానికి నిరసనగా నక్సల్స్ పలు జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. మోడీ ఈ జిల్లాలో గురువారం సభ నిర్వహిస్తుండగా నక్సల్స్ బాంబులు పేల్చడం చర్చనీయాంశమైంది.
 
 బీజేపీ ఆందోళన: నక్సల్ పేలుళ్ల నేపథ్యంలో తమ పార్టీ సభల భద్రతకు ముప్పు పొంచి ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తంచేసింది. ‘‘బీజేపీ సభలే లక్ష్యంగా నక్సల్స్ దాడులు చేయడానికి చూస్తున్నారని చాలాసార్లు మేం ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. ఇటీవల ఉగ్రవాదులు అరెస్టవడం, ఇప్పుడు గయా జిల్లాలో నక్సల్స్ బాంబు పేలుళ్లకు పాల్పడడంతో మా అనుమానాలు నిజమని స్పష్టమవుతోంది’’ అని బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ అన్నారు.
 

మరిన్ని వార్తలు