చెన్నైలో కుండపోత

4 Nov, 2017 02:09 IST|Sakshi

గురువారం రాత్రంతా ఎడతెరపిలేని వర్షం

మెరీనా బీచ్‌లో 30 సెంటీమీటర్ల వర్షపాతం

తీరప్రాంత జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు

రెండ్రోజుల్లో ఆరుగురు మృతి

సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ వర్షాలకు చెన్నై తడిసిముద్దయింది. గత ఐదు రోజులుగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్నం, తిరువారూరు, కడలూరు సముద్రతీర జిల్లాల్లో వర్ష బీభత్సంతో ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. గురువారం రాత్రంతా కురిసిన వర్షానికి చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో రోడ్లపై ఐదు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాలేజీలు, స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.  శుక్రవారం ఉదయం నుంచి వర్షం కాస్త తెరపిచ్చినప్పటికీ సాయంత్రం నుంచి జోరువాన మొదలైంది.

భయం గుప్పిట్లో జనం
గత నెల 27వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షంతో చెన్నైలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మెరీనా బీచ్‌లో 30 సెంటీమీటర్ల వర్షం కురవటంతో బీచ్‌ సర్వీస్‌ రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. చాలాచోట్ల భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గురువారం రాత్రి సెయింట్‌ థామస్‌ మౌంట్‌ నుంచి కొడంబాకంకు భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. రాత్రి 9.30 నుంచి తెల్లవారు జామున 3.20 గంటల వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రైవేటు సంస్థలు శుక్ర, శని వారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించాలని లేదా.. ఇంటినుంచి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.  

వదంతులు నమ్మొద్దు
చెన్నై పరిసరప్రాంతాల్లోని రిజర్వాయర్లు నిండిపోయాయని అవి కూలిపోయే ప్రమాదముందనే సమాచారంతో చెన్నై శివార్లతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవన్నీ వదంతులేనని.. రిజర్వాయర్లు భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్నా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌లు సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. తమను ఆదుకోవాలంటూ చెన్నైలోని ముదిచుర్‌ రోడ్‌పై పలువురు నిరసన తెలిపారు. చెన్నై సహా వర్షప్రభావ జిల్లాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. అయితే దూరప్రాంత రైళ్లు, విమాన సేవలకు అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. జాతీయ విపత్తుల నివారణ బృందాలు నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

కరుణ, పన్నీర్‌సెల్వం ఇళ్లల్లోకి...
చెన్నై గోపాలపురంలోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆళ్వార్‌పేటలోని డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంసహా పలువురు మంత్రుల నివాసాల్లోకి వరదనీరు వచ్చింది. పట్టాలపై వరదనీరు చేరడంతో లోకల్‌ రైళ్లను నిలిపివేశారు. సీఎం పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

ఎగసిపడుతున్న సముద్రం
నాగపట్టణం భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. ఒకవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండగా మరోవైపు కుండపోత కారణంగా జిల్లాలో పలుప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలో వేల ఇళ్లు, లక్షల ఎకరాల్లో వరిపంట నీట మునిగాయి. దాదాపు 10వేల మంది మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆగిపోయారు. తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షంతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ  హెచ్చరించింది.

మరిన్ని వార్తలు