నవకళేబర యాత్ర ప్రారంభం

18 Jul, 2015 13:25 IST|Sakshi
నవకళేబర యాత్ర ప్రారంభం

భువనేశ్వర్ : ప్రతి యేటా ఎంతో వైభవంగా నిర్వహించే పూరిజగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా  విశిష్టమైన మిలీనియం నవకళేబర యాత్ర ప్రారంభమైంది. క్షలాదిమంది భక్తులతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకై పూరీ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. 

బలభద్ర, సుభద్ర సమేతుడై జగన్నాథుడు పూరీ పురవీధుల్లో దర్శనమిచ్చే అద్భుత క్షణాలకు సమయం ఆసన్నమైంది.  ఈ  ఉత్సవాలను  కనులారా వీక్షించేందుకు లక్షలాది భక్తులు ఇప్పటికే పూరి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష విదియ నాడు మొదలై... తొమ్మిది రోజుల తర్వాత ఆషాడ శుక్ల దశమితో వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరిగే ఈ ఉత్సవాల కోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పూరీ జగన్నాథుడి ఆలయం పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది జగన్నాథ రథయాత్రే కానీ.. ఆ ఉత్సవంతో పాటు అక్కడ ఎన్నో ఆసక్తికరమైన వేడుకలు జరుగుతుంటాయి. వాటన్నిటిలోకీ ప్రత్యేకమైనది.. నవకళేబర. అంటే.. కొత్త దేహం అని అర్థం. పూరీ ఆలయంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు రాతి విగ్రహాల్లాగా శాశ్వతం కావు. కొయ్యతో తయారైనవనే విషయం అందరికీ తెలిసిందే.   అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో... పూరీ క్షేత్రంలో గర్భగుడిలోని దారు విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా వేప చెక్కతో చెక్కిన సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకనే నవకళేబర’గా వ్యవహరిస్తారు. అధిక ఆషాఢ మాసం కనిష్ఠంగా 8 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 19 సంవత్సరాలకొకసారి వస్తుంటుంది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ , మంత్రులు,  ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సవాల ఏర్పట్లను దగ్గరుండి  పర్యవేక్షిస్తున్నారు. సుమారు రెండువేలమంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ క్యాంపులు, అంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది, ప్రథమ చికిత్సా   కేంద్రాలు భక్తుల   సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు.   

మరోవైపు ఈ  సందర్భంగా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్  సైకత  శిల్పాలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తమ సృజనాత్మకు పదును పెట్టి జగతి నాథుడు శ్రీజగన్నాథుని నవకళేబర మహోత్సవం విశ్వవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకునేలా పూరీ బీచ్లో అద్భుతాన్ని సృష్టించారు.
 

మరిన్ని వార్తలు