మోదీ, ట్రంప్‌ ఇడ్లీలు..

24 Feb, 2020 15:28 IST|Sakshi

చెన్నై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా తొలిసారి భారత పర్యటనకు విచ్చేశారు. దీంతో వారికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ట్రంప్‌ రెండు రోజుల పర్యటనపై దేశమంతా ఆసక్తిని కనబరుస్తోంది. ఈ క్రమంలో ఓ కళాకారుడు అగ్రరాజ్య అధ్యక్షుడికి వినూత్న స్వాగతం పలికాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఇనైవాన్‌ అనే వ్యక్తి ట్రంప్‌ పర్యటనతోపాటు రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని తన కళాకృతిలో చాటి చెప్పాడు. అందుకోసం మూడు పే..ద్ద ఇడ్లీలను తయారు చేసి వాటిపై మోదీ, ట్రంప్‌ ముఖాలను చిత్రీకరించాడు. (మేడమ్‌ ఫస్ట్‌ లేడీ)


మరో ఇడ్లీపై భారత్‌, అమెరికా జాతీయ పతాకాలను ఆవిష్కరించాడు. ఈ కళాకృతులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వీటిని ఇనైవాన్‌ ఆరుగురు వ్యక్తుల సహాయంతో సుమారు 36 గంటల పాటు శ్రమించి సిద్ధం చేశాడు. ఈ మూడు ఇడ్లీల బరువు సుమారు 107 కిలోలు. కాగా నేడు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లాభాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ట్రంప్‌ కుటుంబానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వీరు అక్కడి నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ట్రంప్‌ దంపతులు ఇద్దరూ నేలపై కూర్చుని చరఖాపై నూలు వడకడం విశేషం. (మోదీ, నేను మంచి ఫ్రెండ్స్‌!)

మరిన్ని వార్తలు