ఎవరండీ ఇంట్లో!

4 Apr, 2020 10:22 IST|Sakshi
చెన్నై కార్పొరేషన్‌ సిబ్బంది శుక్రవారం ఇంటింటా సర్వే చేస్తున్న దృశ్యం

ఢిల్లీ, కొత్తవారి కోసం అన్వేషణ

చెన్నైలో ఇంటింటా సర్వే

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కార్పొరేషన్‌ సిబ్బంది యారంగే ఉళ్లే’ (ఎవరండీ ఇంట్లో) అంటూ ఇళ్ల తలుపులను తడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఎన్నో రోజుల తరువాత తెరుచుకున్న తలుపులకు ఆవల ఉన్న వారిపై అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాగం అహర్నిశలు పాటుపడుతుండగా, విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి అలక్ష్యం వల్ల ఒకరి నుంచి ఒకరికి సోకడం మొదలైంది. ఇదిలా ఉండగా గోరుచుట్టుపై రోకటి పోటులా ఢిల్లీ జమాత్‌ సదస్సుకు హాజరై తమిళనాడుకు చేరుకున్న వారి విపరీతధోరణి వల్ల రాష్ట్రంలో వైరస్‌ విశ్వరూపం దాల్చింది. తమిళనాడు నుంచి ఢిల్లీ జమాత్‌కు 1,600 మంది వరకు హాజరైనట్లు తెలుస్తోంది.

వీరంతా స్వచ్ఛందంగా వైద్యపరీక్షలకు ముందుకు రాకుండా అజ్ఞాతంలో గడపడం వైరస్‌ విశృలంఖత్వానికి దారితీసింది. జమాత్‌కు వెళ్లివచ్చిన వారిలో 1,103 మందిని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి రక్తనమూనాలను సేకరించి పరిశోధనకు పంపింది. గురువారం నాటికి కరోనా పాజిటీవ్‌ల సంఖ్య 309కి చేరుకుంది. ఇందులో 264 మంది జమాత్‌కు హాజరైనవారే కావడం ఆందోళనకరంగా మారింది. జమాత్‌కు హాజరై వైద్యపరీక్షలకు ముందుకు రాని వారి కోసం రాష్ట్రమంతా గాలిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై కార్పొరేషన్‌ సిబ్బంది సైతం నగరంలో ఇల్లిల్లూ తిరుగుతూ జమాత్‌ వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు.  అనుమానితుల ఫోన్‌ నంబర్లను కూడా సేకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు