మోదీ స్పీచ్‌కు చెక్‌ : డీడీ అధికారిపై వేటు

2 Oct, 2019 16:05 IST|Sakshi

చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ మద్రాస్‌లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్‌ కేంద్రం అధికారిపై ప్రసార భారతి వేటు వేసింది. ప్రధాని ప్రసంగం ప్రసారాన్ని డీడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌ వసుమతి అడ్డుకున్నారనే అభియోగాలపై ఆమెను ప్రసారభారతి సస్పెండ్‌ చేసింది. సీనియర్‌ అధికారుల నుంచి అనుమతి ఉన్నా ప్రధాని ప్రసంగాన్ని డీడీ పొదిగై టీవీ ప్రసారం చేయలేదని సమాచారం. వసుమతిని సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణం పేర్కొనకపోయినా ప్రధాని ప్రసంగం వ్యవహారంపైనే ఆమెపై చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఐఐటీ మద్రాస్‌ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సెప్టెంబర్‌ 30న వర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉందా అని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసుమతి తన ఉన్నతాధికారులకు ఈమెయిల్‌ చేయగా ప్రధాని ప్రసంగాన్ని లైవ్‌ ఇవ్వాలని వారు బదులిచ్చినట్టు ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి. స్పష్టమైన ఉత్తర్వులున్నా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసుమతి ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నారని ప్రసార భారతి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు 1965 కింద వసుమతిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రసార భారతి వెల్లడించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు