అంతెత్తు నుంచి కింద పడినా..

6 Jul, 2016 08:27 IST|Sakshi
అంతెత్తు నుంచి కింద పడినా..

రెండు అంతస్థుల మేడ మీద నుంచి పడినా.. ఆ కుక్క క్షేమంగా బయటపడింది. అవును.. చెన్నైలో ఓ శాడిస్టు మెడికల్ విద్యార్థి మేడ మీద నుంచి రెండు చేతులతో పట్టుకుని కిందకు విసిరేసిన కుక్క క్షేమంగా ఉంది. అయితే దాని కాలు మాత్రం కొంచెం దెబ్బతినడంతో అది అంతకుముందులా నడవలేకపోతోంది. కానీ ఇప్పటికీ అది మాత్రం తన తోకను ఊపుతోందని.. అది తన హృదయాన్ని కలచివేసిందని కుక్కను కాపాడిన కార్తీక్ దండపాణి, శ్రవణ్ కృష్ణన్ తదితరులు దాని ఫొటోల, వీడియోలను ట్వీట్ చేశారు. అది తమ వద్దే ఉందని, దానికి చికిత‍్స చేయిస్తున్నామని తెలిపారు. కుక్క క్షేమంగా ఉందని తెలిసి చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు మెడికో గౌతమ్ ఆ కుక్కను విసిరేయడంతో అతడిని పట్టుకుని శిక్షించాలని అందరూ సోషల్ మీడియాలో గట్టిగా వాదించారు.

కుక్కను కిందపడేసిన శాడిస్టును చెన్నైకి చెందిన మెడికో గౌతమ్ సుదర్శన్గా చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇతను చెన్నై శివారు తండాలంలోని మధా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన తమకు గౌతమ్ స్నేహితుడొకరు ఇచ్చిన సమాచారం కీలకంగా మారిందని పేర్కొన్నారు. బిల్డింగ్ పై నుంచి కుక్కను కిందికి తోసేసిన వీడియో వైరల్ కావడంతో అందులో ఉన్న గౌతమ్ ను అతని క్లాస్ మేట్ గుర్తుపట్టి పోలీసులకు ఉప్పందించడంతో శాడిస్ట్ జాడ తెలిసినట్లయింది.

మరిన్ని వార్తలు