మనసు దోచుకుంటున్న స్కూల్‌ లెటర్‌

24 Apr, 2018 19:25 IST|Sakshi
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేఖ

చెన్నై : విద‍్య వ్యాపారంగా మారిన నేటికాలంలో ఎప్పుడూ మార్కులు.. ర్యాంకులు..అంటూ విద్యార్థుల వెంటపడే పాఠశాల, కళాశాల గురించే మనం విన్నాం. కొన్ని పాఠశాలలైతే సెలవుల్లోనూ విద్యార్థులకు హోం వర్క్‌ ఇస్తాయి. అయితే అందుకు భిన్నంగా ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సెలవుల్లో మనకు ఇష్టమైన వారితో గడుపుతూ సెలవులను ఆస్వాదించాలంటూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. చెన్నైలోని అన్నై వయోలెట్‌ మెట్రిక్‌ స్కూల్‌ వేసవి సెలవుల్లో భాగంగా హాలిడే అసైన్‌మెంట్‌ పేరిట తల్లిదండ్రులకు ఓ లేఖ పంపింది.

హాలిడే అసైన్‌మెంట్‌ ఇదే..
తల్లిదండ్రులు రోజుకు రెండుసార్లు తమ పిల్లలతో కలిసి భోజనం చేయాలి. అంతేకాదు వారికి రైతుల కష్టం విలువ కూడా తెలియజెప్పుతూ ఆహారం వృధా చేయకూడదనే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పాలి. బామ్మాతాతయ్యలతో, ఇరుగుపొరుగు వారితో బంధం పెంచుకొనేలా వారిని ప్రోత్సహించాలి. మొక్కలు నాటడం, జంతువులతో ఆడుకోవడం వంటి అలవాట్లను నేర్పించాల‍ంటూ.. ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాలతో లేఖను నింపారు.

ఆ రోజులు వేరు..
స్కూలు ప్రిన్సిపల్‌ లిదియా దైవసహాయం మాట్లాడుతూ.. ‘మా చిన్నతనంలో సెలవులంటే ఎగిరి గంతేసేవాళ్లం. ఆటపాటలతో హాయిగా గడిపే వాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చదువే లోకంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా సంపాదనలో మునిగిపోయి పిల్లలతో సమయం గడపలేకపోతున్నారు. అందుకే ఈసారి మేము ఇలా ప్లాన్‌ చేశామంటూ’  వివరించారు.

మరిన్ని వార్తలు