18 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

18 Jun, 2019 12:26 IST|Sakshi

చెన్నై : పుట్టిన రోజు వేడుకల పేరిట ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు అనేకం చూశాం. కానీ ఈ తింగరి కుర్రాళ్లు ‘బస్‌ డే’ పేరిట తమ ప్రాణాలనే కాక ప్రయాణికుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టారు. డ్రైవర్‌ జాగ్రత్తగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది.. లేదంటే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారు. చాలా ఏళ్లుగా తమిళ నాట కాలేజీ విద్యార్థులు బస్‌ డే పేరిట వేడుకలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా విద్యార్థులు కదులుతున్న బస్సు ఎక్కి అనేక స్టంట్లు చేస్తుంటారు.

అయితే ఇలాంటి వేడుకల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటమే కాక ప్రాణాపాయం ఉందని భావించిన ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ వేడుకలను నిషేధించింది. కానీ మం‍గళవారం కొందరు విద్యార్థులు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. పోలీసుల మాట లెక్క చేయకుండా ‘బస్‌ డే’ వేడుకలు నిర్వహించారు. దానిలో భాగంగా దాదాపు 30 మంది విద్యార్థులు కదులుతున్న బస్సు మీదకు చేరుకుని ఒక్కసారిగా కిందకు దూకారు. అప్పటికే కండక్టర్‌, డ్రైవర్‌ ఎంత వారిస్తున్న విద్యార్థులు లెక్క చేయలేదు.

వీరి పిచ్చి చేష్టలకు భయపడిన డ్రైవర్‌ ఒక్క సారిగా బ్రేక్‌ వేయడంతో భారీ ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ సంఘటనలో దాదాపు 18మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు 20 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పచ్చయప్ప కాలేజ్‌, అంబేడ్కర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
 

మరిన్ని వార్తలు