17 మందిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే.....

5 Dec, 2019 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అది అటవి ప్రాంతం. దాదాపు 20 మంది కరడుగట్టిన తిరుగుబాటుదారులు అక్కడ సమావేశమయ్యారు. వారిని చుట్టుముట్టిన సాయుధులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. హాహాకారాలు మిన్నంటాయి. ఆరుగురు పిన్నలు సహా 17 మంది తిరుగుబాటుదారుల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ సంఘటనలో కొంత మంది సాయుధులు గాయపడ్డారు. తిరుగుబాటుదారుల వద్ద ఒక్క తుపాకీగానీ, బాంబుగానీ దొరకలేదు. వాటన్నింటిని మిగతా ముగ్గురు తిరుగుబాటుదారులు పట్టుకొని  పారిపోయి ఉంటారు’

ఇది దాదాపు ఏడున్నర ఏళ్ల క్రితం అంటే, 2012, జూన్‌ 28వ తేదీ రాత్రి చత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా, సర్కేగూడ గ్రామం శివారులో జరిగింది. వారు తిరుగుబాటుదారులు ఎంత మాత్రం కాదని, వారంతా సర్కేగూడ గ్రామానికి చెందిన సాధారణ ప్రజలని తేలింది. కాల్పులు జరిపిందీ మరెవరో కాదు, సీఆర్‌పీఎఫ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పోలీసులు. ఆ సంయుక్త సాయుధ దళం నక్సలైట్ల కోసం గాలిస్తూ ఆ రాత్రి అటు గుండా వెళుతుండగా, ఓ చోటు చెట్ట వద్ద మనుషుల అలికిడి వినిపించింది. వారంతా నక్సలైట్లు కాబోలు అని పోలీసులు భావించారు. అర్దచంద్రాకారంలో వారిని చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారు. 

అక్కడికక్కడే హాహాకారాలు చేస్తూ ఆరుగురు పిల్లలు సహా 17 మంది గ్రామస్థులు రక్తం మడుగులో ప్రాణాలు వదిలారు. పోలీసులు అర్దచంద్రాకారంలో చుట్టుముట్టి కాల్పులు జరపడంతో వారి తుపాకీ గుండ్లే వారికి తగిలి కొంత మంది గాయపడ్డారు. ప్రతిరోజు గ్రామస్థులు ఆ చిట్టి గ్రామం శివారులో వెన్నెల వాకిల్లో గుమిగూడి పిచ్చాపాటి మాట్లాడుకోవడం పరిపాటి. ఈ అలవాటే అనుకోకుండా వారి ప్రాణాలను తీసింది. 

ఈ విషయాలను మధ్యప్రదేశ్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీ జస్టిస్‌ వీకే అగర్వాల్‌ చైర్మన్‌గా ఏర్పాటైన ఏకసభ్య కమిషన్‌ తన నివేదికలో వెల్లడించారు. ఆయన ఇటీవల ఈ మేరకు ఓ నివేదికను చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి సమర్పించగా, అందులోని విషయాలను ఓ ఆంగ్ల పత్రిక బయట పెట్టింది. ఈ విషయాలన్నీ నిజమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం నాడు ధ్రువీకరించారు. ఇంకా ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌ పరిశీలనకు రాలేదని, కేబినెట్‌ సమావేశంలో నివేదిక మీద నిర్ణయం తీసుకోవచ్చని ఆ అధికారి తెలిపారు. అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని అప్పట్లో అన్ని వర్గాలు ఆందోళన చేయగా, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి రామన్‌ సింగ్, విచారణకు 2012, జూలై 11వ తేదీన ఏకసభ్య కమిషన్‌ను నియమించారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.

 సంచలనం సష్టించిన ‘దిశ అత్యాచారం–హత్య’ కేసులో ప్రజాసంఘాలతోపాటు పార్టీలకు అతీతంగా నాయకులంతా ముక్త కంఠంతో నేరస్థులను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 17 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న నేరస్థులకు ఏ శిక్ష విధించాలంటారో వారు స్పందిస్తేగానీ తెలియదు. నేటి వరకు ఎవరి నుంచి ఏ స్పందనా పెద్దగా రాలేదు. చనిపోయిన వారంతా ఆదివాసులు. వారి ప్రాణాలకు విలువలేదంటూ వదిలేస్తారా!?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు