ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్‌

12 Nov, 2018 19:00 IST|Sakshi

రాయ్‌పూర్‌ : కట్టుదిట్టమైన భద్రత నడుమ ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా ఈసారి 70 శాతం పోలింగ్‌ నమోదవడం విశేషం. సురక్షిత ఓటింగ్ కోసం భద్రతా దళాలను భారీగా రంగంలోకి దించటంతో పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఇక తొంభై నియోజక వర్గాలున్న ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో రాజ్‌నంద్‌గాం, కొండగాం, కాంకేర్‌, బస్తర్‌, నారాయణ్‌పూర్‌, సుక్మా, బీజాపూర్‌, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో ఈరోజు తొలిదశ పోలింగ్‌ జరిగింది. వీటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 72 నియోజక వర్గాల్లో ఈనెల 20(నవంబరు)న పోలింగ్‌ జరగనుండగా.. ఫలితాలు డిసెంబరు 11న వెలువడనున్నాయి.

కాగా పోలింగ్‌ సమయంలో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్‌ ట్రాకర్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
తోంక్ పాల్ చింతల్నార్ నుండి ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని వస్తున్న భద్రతాదళాల మీద మావోయిస్టుల కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరి మృతదేహాలను భద్రత దళాలు స్వాధీన పరుచుకున్నాయి. కాగా ఈ సమయంలో భద్రతా దళాలతో పాటు, డ్యూటీ ముగించుకుని వస్తున్న ఎలక్షన్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు