మాజీ సీఎం అజిత్‌ జోగికి గుండెపోటు

9 May, 2020 15:30 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను స్థానిక శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అజిత్‌ జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా 1946లో జన్మించిన అజిత్‌ జోగి భోపాల్‌లోని మౌలానా ఆజాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన ఆయన.. కొన్నాళ్లపాటు రాయ్‌పూర్‌ నిట్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి ఐఏఎస్‌ సాధించారు. 

ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి.. ఛత్తీస్‌గఢ్‌ తొలి ముఖ్యమంత్రిగా అజిత్‌ జోగి చరిత్రలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో 2016లో జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ పార్టీని స్థాపించారు. ఇక అజిత్‌ జోగి తర్వాత బీజేపీ నేత రమణ్‌ సింగ్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి.. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2018లో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకుంది.   

మరిన్ని వార్తలు