వాట్సాప్ లో మెసేజ్, జర్నలిస్ట్ అరెస్ట్

23 Mar, 2016 12:09 IST|Sakshi
ప్రభాత్ సింగ్ (ఫైల్)

దంతెవాడ: బస్తర్ ప్రాంతాన్ని పోలీస్ రాష్ట్రంగా మారుస్తున్నారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దంతెవాడకు చెందిన జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. సీనియర్  పోలీసు అధికారి గురించి వాట్సాప్ లో అభ్యంతకర మెసేజ్ పోస్టుచేశారనే ఆరోపణలతో జర్నలిస్ట్ ప్రభాత్ సింగ్ ను జగదల్ పూర్ లో సోమవారం అరెస్ట్ చేశారు.

మంగళవారం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో పోలీసులు తనను కొట్టారని కోర్టుకు అతడు తెలిపాడు. అతడికి కోర్టు మార్చి 31 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రభాత్ సింగ్ పై పోలీసులు గతేడాది నుంచి మూడు కేసులు నమోదు చేశారు. దంతెవాడలో ఆధార్ సెంటర్ నడుపుతున్న అతడు పలువురిని మోసం చేసినట్టు ఆరోపించారు. తాజా కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని సింగ్ తరపు లాయర్ తెలిపారు. సింగ్ అరెస్ట్ ను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బాగ్ హెల్ మంగళవారం అసెంబ్లీలో లేవనెత్తారు.

బస్తర్ ప్రాంతంలో జర్నలిస్టులపై పోలీసు కేసులు పెరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు కలిసివున్నారనే ఆరోపణలతో ఇంతకుముందు ఇద్దరు స్థానిక జర్నలిస్టులు సంతోష్ యాదవ్, సమరు నాగ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. స్ర్కాల్ డాన్ నిన్ వెబ్ సైట్ లో పనిచేసే ఓ కంట్రిబ్యూటర్ ను బస్తర్ ప్రాంతం వదిలి పెళ్లాలని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు