వైరల్‌ వీడియో.. కాళ్లతోనే అద్భుతాలు సృష్టిస్తోన్న యువకుడు

29 Jun, 2020 14:38 IST|Sakshi

రాయ్‌పూర్‌: జీవితంలో ఒక లక్ష్యం కోసం శ్రమిస్తూ..ఓటమి ఎదురయి.. మధ్యలోనే వదిలేసే వారు.. అసలు ఏ లక్ష్యం లేకుండా ఖాళీగా తిరిగేవారు తప్పకుండా ఈ వార్త చదవాలి. చేతులు లేకుండా పుట్టిన ఓ యువకుడు తన కలను సాకారం చేసుకోవడం కోసం చేస్తోన్న కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. వివరాలు.. చత్తీస్‌గఢ్‌ భిలాయ్‌ ప్రాంతానికి చెందిన గోకరన్‌కు గొప్ప ఆర్టిస్ట్‌ కావాలనేది కల. కానీ దురదృష్టవశాత్తు అతడికి పుట్టుకతోనే చేతులు లేవు. పైగా వినికిడి లోపం. అయితే అంగవైకల్యం అతడి ఆశయ సాధనకు ఏ మాత్రం అడ్డురాలేదు. చేతులు లేకపోతేనేం.. కాళ్లు ఉన్నాయి కదా అనుకున్న గోకరన్‌.. పాదాల సాయంతో బొమ్మలు గీయడం సాధన‌ చేశాడు. కొన్నాళ్లకు గోకరన్‌ శ్రమ ఫలించి కుంచె అతడి పాదాక్రాంతమైంది. ప్రస్తుతం అతడు ఎందరో గొప్పకళాకారులకు ధీటుగా కాళ్లతోనే అద్భుతమైన చిత్రాలు గీస్తున్నాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రియా శుక్లా అనే ఐఏఎస్‌ అధికారిణి తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ‘ఈ వీడియోలో పెయింటింగ్‌ వేస్తోన్న యువకుడి పేరు గోకరన్‌ పాటిల్‌. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇతడికి పుట్టుకతోనే చేతలు లేవు. వినికిడి లోపం కూడా. కానీ తన కలను నిజం చేసుకోవడానికి అతడు నిరంతరం శ్రమించాడు. తేలికగా ఓటమిని ఒప్పుకునే వారికి గోకరన్‌ ప్రేరణగా నిలుస్తున్నాడు’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నెటిజనులు గోకరన్‌ పట్టుదలని ప్రశంసిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు