హక్కుల కోసం నక్సల్స్‌లో చేరొద్దు

15 Apr, 2018 02:30 IST|Sakshi
బీజాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో మాట్లాడుతున్న మోదీ, సంప్రదాయ తలపాగాతో ప్రధాని

నిమ్న వర్గాలకు అంబేడ్కర్‌ రాజ్యాంగంలో హక్కులు కల్పించారు

బీజాపూర్‌ బహిరంగ సభలో ప్రధాని మోదీ

ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం

2022 కల్లా లక్షన్నర గ్రామాల్లోని పీహెచ్‌సీలను వెల్‌నెస్‌ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడి

బాబాసాహెబ్‌ మనకు రాజ్యాంగాన్నిఇచ్చారు. మీ హక్కులను కాపాడేలా భరోసానిచ్చారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది.
ఉద్యమాన్ని నడుపుతున్న వారు మీలో ఒకరు కాదు. ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలనుబలి చేస్తున్నారు.

 జంగాలా (బీజాపూర్‌): సమాజంలోని వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ కోసం భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌.. రాజ్యాంగంలో ప్రత్యేకాంశాలను జోడించారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల వారు తమ హక్కులను పొందటానికి అంబేడ్కరే కారణమన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం కారణంగానే తను ఈ స్థాయికి ఎదిగినట్లు మోదీ తెలిపారు. ‘సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన ఓ పేదరాలి కుమారుడు.. ప్రధాని కావటం నిజంగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కారణంగానే సాధ్యమైంది’ అని ప్రధాని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్‌ జిల్లా జంగాలాలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మోదీ ప్రారంభించారు. ‘అంబేడ్కర్‌ విదేశాల్లో గొప్ప చదువు చదివారు. దీని కారణంగా ఏదో ఓ అభివృద్ధి చెందిన దేశంలో స్థిరపడి.. దర్జాగా బతికేసేందుకు అవకాశం ఉంది. కానీ అలా చేయలేదు. స్వదేశానికి తిరిగొచ్చి.. దళితుల జీవితాలను ఉద్ధరించేందుకు తన జీవితాన్నే అంకితం చేశారు. అంబేడ్కర్‌ కారణంగానే.. నేడు దళితులు తమ హక్కులను పొందుతూ గౌరవంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి ఆకాంక్షలను పూర్తి చేసేందుకు పనిచేస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. యువతీ, యువకులు తమ హక్కులను కాపాడుకునేందుకు నక్సలిజంలో చేరొద్దని ఆయన సూచించార.

అంబేడ్కర్‌ చూపిన బాటలో..
మావోయిస్టుల కారణంగానే వీరి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుబడిందన్నారు. హక్కుల సాధనకు యువకులు నక్సలిజం వైపు అడుగులు వేస్తున్నారని.. అది సరైన మార్గం కాదని మోదీ తెలిపారు. ‘బాబాసాహెబ్‌ మనకు రాజ్యాంగాన్నిచ్చారు. మీ హక్కులను కాపాడేలా ఆయన భరోసా ఇచ్చారు. ఈ భరోసాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు (యువతీ, యువకులు) తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఉద్యమాన్ని నడుపుతున్న వారు ఎక్కడినుంచో వచ్చారు. వారు మీలో ఒకరు కాదు. అడవుల్లో ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలను బలిపశువులు చేస్తున్నారు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే.. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.  

పీహెచ్‌సీల దశ మారుస్తాం..
ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా.. లక్షా 50వేల గ్రామాల్లోని ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయి, సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో పనిచేయనున్నారు. 2022 కల్లా పీహెచ్‌సీలను ఆరోగ్య, వెల్‌నెస్‌ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. ఈ పథకంలో భాగంగా జంగాలాలో తొలి పీహెచ్‌సీని మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో దేశంలోని 115 వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ‘పాత మార్గాల్లో వెళ్తూ.. కొత్త లక్ష్యాలను చేరుకోవటం కష్టం. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు కొత్త అభివృద్ధి నమూనాలను సిద్ధం చేస్తోంది’ అని ప్రధాని తెలిపారు. శనివారం ప్రారంభించిన మరో పథకం ‘గ్రామ్‌ స్వరాజ్‌ యోజన’ ద్వారా పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.

శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చరణ్‌ పాదుకా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఓ గిరిజన మహిళకు చెప్పులు బహూకరించి తొడుగుతున్న మోదీ

మరిన్ని వార్తలు