ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం అరెస్ట్‌

21 Aug, 2019 21:53 IST|Sakshi

న్యూఢిల్లీ :  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా ముడుపుల కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరాన్ని నాటకీయ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం సీబీఐ, ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసుల సాయం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని సీబీఐ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించినట్టుగా సమాచారం. అంతకు ముందు చిదంబరం నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. చిదంబరాన్ని అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన సీబీఐ, ఈడీ అధికారులు గోడలు దూకి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. కాగా, మంగళవారం ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ పటిషన్‌ను తిరస్కరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారు. సుప్రీం కోర్టులో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి.

 
అయితే బుధవారం సాయంత్రం చిదంబరం ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడికి చేరుకుని చిదంబరాన్ని అరెస్ట్‌ చేసేందుక యత్నించారు. అయితే కాంగ్రెస్‌ కార్యకర్తలు సీబీఐ అధికారులను అడ్డుకోవడంతో.. చిదంబరం తన నివాసానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత సీబీఐ బృందం చిదంబరం నివాసానికి చేరుకుని లోనికి వెళ్లేందుకు యత్నించింది. అయితే గేట్లు తెరవకపోవడంతో సీబీఐ అధికారులు గోడపై నుంచి దూకి చిదంబరం నివాసంలోకి ప్రవేశించారు.

మరోవైపు సుప్రీం కోర్టులో చిదంబరం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ శుశ్రవారం విచారణకు రానుంది. ఇక 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు సమకూరడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ)  ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.

చదవండి : అజ్ఞాతం వీడిన చిదంబరం

మరిన్ని వార్తలు