పొదుపు ఖాతా వడ్డీరేట్లలో కోతపై చిదంబరం ఫైర్‌

1 Apr, 2020 17:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదని, ఇది ఎవరో ఇచ్చిన చెత్త సలహా ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఆపద సమయంలో ప్రజల జీవితాలను కాపాడటం ముఖ్యమని, జీడీపీ లెక్కలు కాదని చిదంబరం హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చెత్త సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయనే విషయం తనకు తెలుసని, అయితే ఇంత చెత్త సలహా పట్ల తాను ఆశ్చర్యపోతున్నానని వ్యాఖ్యానించారు.

పీపీఎఫ్‌, చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటు తగ్గించడం సాంకేతికంగా సరైనది కావచ్చు..కానీ నిర్ణయం తీసుకున్న సమయం సరైంది కాదని చిదంబరం ట్వీట్‌ చేశారు. ప్రజల రాబడి అనిశ్చితిలో పడిన ఇలాంటి సందర్భాల్లో వారు తమ పొదుపుపై వచ్చే రాబడిపై ఆధారపడతారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే సమీక్షించి జూన్‌ 30 వరకూ పొదుపు ఖాతాలపై పాత వడ్డీరేట్లనే కొనసాగించాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు కేవలం 4.8 శాతానికే పరిమితమవుతుందని ఆయన అంచనా వేశారు.

చదవండి : చిన్న పొదుపు పథకాలపై వడ్డీ కోత 

మరిన్ని వార్తలు