బెయిలు.. అయినా తప్పదు జైలు

23 Oct, 2019 03:35 IST|Sakshi

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో

చిదంబరంకి సుప్రీంకోర్టు బెయిల్‌

అయినా, మనీల్యాండరింగ్‌ కేసులో ఈడీ అదుపులోనే చిదంబరం

న్యూఢిల్లీ: ఎట్టకేలకు సీబీఐ దాఖలు చేసిన ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. చిదంబరం సాక్షులను ప్రభావితం చేసే అవకాశంగానీ, విదేశాలకు పారిపోయే ప్రమాదంగానీలేదని కోర్టు అభిప్రాయపడింది. రూ.1లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ చిదంబరం పూర్తిగా జైలునుంచి విముక్తి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కాంకి సంబంధించిన మనీ ల్యాండరింగ్‌ కేసులో చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. 

చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2007లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సా హక మండలి.. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశీ నిధులు(రూ.305 కోట్లు) సమకూర్చిపెట్టేందుకు చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2017లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చిదంబరంపై మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఆగస్టు 21న చిదంబరంను ఢిల్లీలోని ఆయన నివాసంలోనే సీబీఐ అరెస్టు చేయడం తెల్సిందే. అక్టోబర్‌ 18న చిదంబరంని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలోకి తీసుకుంది.

మరిన్ని వార్తలు