ప్రధాని మోదీ దృక్పథం బాగుంది: చిదంబరం

16 Aug, 2019 15:15 IST|Sakshi

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలోని మూడు అంశాలను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రశంసించారు. జనాభా పెరుగుదల భవిష్యత్తు తరాలను ఏ విధంగా నాశనం చేస్తుందో మోదీ వివరించిన విధానం బాగుందన్నారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని చేసిన ఈ మూడు ప్రకటనలను మనమందరం స్వాగతించాలి. చిన్న కుటుంబాలను కలిగి ఉండటమే దేశభక్తి, ప్లాస్టిక్‌ నిషేధం దిశగా చర్యలు, సంపద సృష్టికర్తలను గౌరవించాలి’’ అన్న మోదీ మాటలను చిదంబరం ట్విటర్‌లో ఉటంకించారు.

కాగా ఎర్రకోటలో తన ప్రసంగంలో భాగంగా జనాభా విస్పోటనం, ప్లాస్టిక్‌ నిషేదం, సంపద సృష్టి కర్తలను గౌరవించడం తదితర అంశాలపై మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. సంపద సృష్టి  గొప్ప జాతీయ సేవ అని మోదీ అన్నారు. ప్లాస్టిక్‌ వాడకం పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలిగిస్తుందని, దీనిపై ఆక్టోబర్‌ 2 నాటికి మార్పు తీసుకు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ మూడు అంశాలపైన ప్రధాని దృక్పథం బాగుందని చిదంబరం కొనియాడారు. మొదటి, చివరి సందేశాలను ఉద్ధేశించి ప్లాస్టిక్‌ నిషేదం, జనాభా నియంత్రణ అంశంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనికోసం వందలమంది వాలంటీర్లు క్షేత్ర స్థాయి నుంచి కృషి చేయాలని చిదంబరం సూచించారు.

మరిన్ని వార్తలు