‘తీహార్‌ జైల్లోనే చిదంబరం బర్త్‌డే’

15 Sep, 2019 17:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం జైలు జీవితం తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తీహార్‌ జైల్లోనే సోమవారం తన 74వ జన్మదినం జరుపుకోనున్నారు.1945లో తమిళనాడులోని శివగంగ జిల్లా కనదుకథన్‌లో జన్మించిన చిదంబరం సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈనెల 19 వరకూ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. కాగా, చిదంబరం బెయిల్‌ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు ఈనెల 23న విచారించనుంది. ఈ కేసులో చిదంబరంను సెప్టెంబర్‌ 5న కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించింది. నాటకీయ పరిణామాల మధ్య చిదంబరంను ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆగస్ట్‌ 21న సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి రూ 305 కోట్ల విదేశీ నిధులకు ఆయన నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో చిదంబరంపై ఈడీ కూడా మనీ ల్యాండరింగ్‌ కేసును దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు